దేశ ప్రజలకి కేంద్రం బహుమతుల ప్రదానం?

December 16, 2016


img

దేశంలో నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం నిన్న రెండు కొత్త ప్రోత్సాహక పధకాలని ప్రకటించింది. అవి: లక్కీ గ్రాహక్ యోజన, డిజి-ధన్ వ్యాపారి యోజన. ఈ రెండు పధకాల క్రింద ప్రజలకి, వ్యాపారస్తులకి మొత్తం రూ.340 కోట్లు బహుమతులుగా (ప్రోత్సాహకాలు) ఇస్తామని నీతి ఆయోగ్ సి.ఈ.ఓ.అమితాబ్ కాంత్ నిన్న ప్రకటించారు. 

దీనిలో లక్కీ గ్రాహక్ యోజన పధకం సామాన్య ప్రజల కోసం కాగా, రెండవది వ్యాపారస్తుల కోసం నిర్దేశ్యించినది. ఈ రెండు పధకాలని మూడు నెలల పాటు అమలు చేస్తారు. నగదు రహిత లావాదేవీలు చేస్తున్న ప్రజలకి, వ్యాపారస్తులని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు ఇస్తారు. 

ప్రజలకి ప్రకటించిన పధకంలో రూ.50 నుంచి రూ.3,000 వరకు చేసే నగదు రహిత లావాదేవీలకి బహుమానాలు ఉంటాయి. రోజుకి 15,000 మంది చొప్పున ఎంపిక చేసి ఒక్కొక్కరికీ రూ.1,000 బహుమానంగా అందిస్తారు. అలాగే వారానికి ఒకసారి 7,000 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి గెలిచినవారికి ఒక్కొక్కరికీ రూ.5,000, 10,000, రూ.1 లక్ష చొప్పున బహుమతిగా ఇస్తారు. ఏప్రిల్ 14న మెగాడ్రాలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా కోటి రూపాయలు, రెండవ బహుమతిగా రూ.50 లక్షలు, మూడో బహుమతిగా రూ.25 లక్షలు ఇస్తారు.

వ్యాపారస్తుల కోసం ప్రవేశపెట్టిన పధకంలో నగదు రహిత లావాదేవీలు చేస్తున్నవారికి వారానికి 7,000 మందికి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి గెలిచినవారికి ఒక్కొక్కరికీ రూ.2,500, రూ.50,000 చొప్పున బహుమతులు ఇస్తారు. అదే విధంగా మెగా డ్రాలో గెలిచినా వారికి మొదటి బహుమతిగా రూ.50 లక్షలు, రెండవ బహుమతిగా రూ.25 లక్షలు మూడో బహుమతిగా మొదటి బహుమతిగా కోటి రూపాయలు, రెండవ బహుమతిగా రూ.50 లక్షలు, మూడో బహుమతిగా రూ.5 లక్షలు ఇస్తారు.

నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించడం కోసం కేంద్రప్రభుత్వం ఇటువంటి తాత్కాలిక పధకాలని ప్రవేశపెట్టి, వాటి ప్రచారం కోసం, వాటి ప్రోత్సాహకాల కోసం రూ.340 కోట్లు వృధా చేయడం కంటే ఆ డబ్బుతో మొబైల్ బ్యాంకింగ్, ఆన్-లైన్ లావాదేవీలకి పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థని ఏర్పాటు చేసి ఉండి ఉంటే ప్రజలు ధైర్యంగా నగదు రహిత లావాదేవీలు చేయడానికి మొగ్గు చూపేవారు. నేటికీ దేశంలో ఏ ఒక్క మొబైల్ లేదా కంప్యూటర్ కానీ హ్యాకింగ్ కి అతీతం కాదని ఆ రంగంలో నిపుణులే తేల్చి చెపుతున్నారు. దానికి తోడు నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఉన్న మన దేశంలో మొబైల్ బ్యాంకింగ్ లో సైబర్ సెక్యూరిటీ ఇంకా పటిష్టంగా ఉండవలసిన అవసరం ఉంది. కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. 

కేంద్రప్రభుత్వం నగదు రహిత లావాదేవీలని ప్రోత్సాహించాలనుకొన్నప్పుడు సామాన్య ప్రజలు ఎక్కువగా వినియోగించే డెబిట్, క్రెడిట్ కార్డులతో చేసిన లావాదేవీలకి బహుమతులు ఇవ్వాలి కానీ ఈ రెండు పధకాలని వాటికి వర్తింపజేయలేదు. అదీ మరొక పొరపాటే అని చెప్పక తప్పదు. 125 కోట్ల మంది జనాభా ఉన్న భారదేశంలో హడావుడిగా ప్రయోగాలు చేస్తే ఏమవుతుందో నోట్ల రద్దు తదనంతర పరిణామాలు కళ్ళకి కట్టినట్లు చూపిస్తున్నప్పుడు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ నగదు రహిత లావాదేవీల పేరుతో హడావుడిగా మరొక ప్రయోగమా చేయాలనుకోవడం చాలా తొందరపాటేనని చెప్పక తప్పదు.


Related Post