ప్రతిపక్షాలకి అజెండాయే లేదా?

December 16, 2016


img

నేటి నుంచి తెలంగాణా శాసనసభ సమావేశాలు మొదలవుతాయి కనుక సమావేశాల పని దినాలు, అజెండా ఖరారు చేసేందుకు నిన్న బిఎసి సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణా భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస శాసనసభా పక్ష సమావేశం నిర్వహించినప్పుడు తెరాస ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “బిఎసి సమావేశానికి వచ్చిన ప్రతిపక్షాలు చెప్పిన విషయాలని బట్టి వారి వద్ద శాసనసభలో మాట్లాడేందుకు బలమైన అంశాలు ఏవీ లేవని అర్ధమయింది. కనుక ఈ సమావేశాలలో మనమే ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ రెండున్నరేళ్ళలో మన ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఏమేమి చర్యలు చేపట్టిందో వివరిద్దాం. ప్రతిపక్షాలు ఎంతగా రెచ్చగొట్టినా ఎవరూ రెచ్చిపోకుండా వారు ప్రస్తావించిన అంశాలకి నేరుగా సమాధానాలు చెపుదాం. సభలో చర్చలు పక్కదారి పట్టకుండా అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు చెప్పేవిధంగా అందరూ పూర్తి సమాచారంతో సభకు హాజరుకావాలి. కేంద్రం పరిధిలో ఉన్న నోట్ల రద్దు అంశం గురించి సభలో చర్చించవలసింది ఏమీలేదు. కానీ దాని వలన ఎదురైనా సమస్యలని మన ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తోందో నేనే సభకి వివరిస్తాను,” అని కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. 

ప్రతిపక్షాల వద్ద శాసనసభలో ప్రస్తావించేందుకు ముఖ్యమైన అంశాలు, సమస్యలు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం నిజమయితే అది ఆశ్చర్యకరమైనదే. ఎందుకంటే, ప్రతిపక్షాలు రైతుల సమస్యలు, బలవంతపు భూసేకరణ, రుణమాఫీ వంటి తెరాస హామీల అమలు, విద్యార్ధులు ఫీజు రీ ఇంబర్స్మెంట్ వంటి అనేక సమస్యలపై సభలో తెరాస సర్కార్ ని గట్టిగా నిలదీయబోతున్నామని పదేపదే చెపుతున్నాయి. పంటరుణాల మాఫీని ఒకేసారి చెల్లించమని ప్రతిపక్షాలు గతః రెండున్నరేళ్ళుగా డిమాండ్ చేస్తున్నా తెరాస సర్కార్ వాయిదాల పద్దతిలోనే చెల్లిస్తుండటం చేత అది వారికి ఇస్తున్న కొద్దిపాటి డబ్బు వడ్డీలకే పోతోందని వారు వాదిస్తున్నారు. 

తెరాస సర్కార్ ఈ రెండున్నరేళ్ళలో రాష్ట్రంలో విద్యుత్ సమస్యలని పూర్తిగా తీర్చిన మాట వాస్తవమే కానీ ఇంకా అనేక సమస్యలున్నాయి. వాటి గురించి ప్రొఫెసర్  కోదండరామ్ వంటివారు కూడా ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక శాసనసభ, మండలిలో ఈసారి కూడా ప్రతిపక్షాలు తెరాస సర్కార్ ని గట్టిగానే నిలదీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అటువంటప్పుడు వాటి వద్ద మాట్లాడేందుకు అజెండాయే  లేదనుకొంటే ఎవరికి నష్టం? అయినా తినబోతూ గారెల రుచి ఎలాగుందని అడగడం దేనికి? కొద్ది సేపటిలోనే ఆ రుచి ఎలాగు తెలుస్తుంది కదా!         Related Post