జనసేనాని ఎప్పుడూ లేటుగానే వస్తాడా?

December 16, 2016


img

జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్ళీ చాలా రోజుల తరువాత రాజకీయాల గురించి మాట్లాడారు. అయితే మళ్ళీ అసందర్భ విషయాల (సమస్యలు) గురించి మాట్లాడటమే చాలా విచిత్రంగా ఉంది. ప్రస్తుతం దేశమంతా నోట్ల రద్దు, దాని పర్యవసానాల గురించి మాట్లాడుకొంటున్నారు. దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. కనుక పవన్ కళ్యాణ్ మొదట వారి సమస్యల గురించి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నించి ఉంటే చాలా సముచితంగా ఉండేది. కానీ గోవధ నిషేధం గురించి భాజపాని (కేంద్రప్రభుత్వాన్ని) ప్రశ్నించడం చాలా అసందర్భంగా ఉంది. 

ఆయన ఈరోజు ప్రకటించిన 5 అంశాలలో  గోవధ నిషేధం,  రోహిత్ వేముల, దేశభక్తి, నోట్ల రద్దు, ఏపికి ప్రత్యేక హోదా ఉన్నాయి. వాటిలో నోట్ల రద్దు తప్ప మిగిలినవన్నీ ప్రస్తుతం అప్రస్తుత అంశాలే అని అర్ధం అవుతూనే ఉన్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ మిగిలిన ఆ అంశాల గురించి కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించదలచుకొంటే తప్పు లేదు కానీ దానికీ ఒక సమయం సందర్భం చూసుకొంటే ఎక్కువ ప్రభావం చూపి ఉండేవి. 

ప్రస్తుతం దేశాన్ని కుదిపివేస్తున్న నోట్ల రద్దు, తదనంతర పరిణామాల గురించి పవన్ కళ్యాణ్ మొదట మాట్లాడి ఉండి ఉంటే అన్ని వర్గాల నుంచి చాలా విశేష స్పందన వచ్చేది. సమయోచితంగా కూడా  ఉండేది. కానీ గోవధ నిషేధం అంశం గురించి ప్రశ్నలు సందించారు. ఇది ఆయన రాజకీయ అపరిపకత్వతకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో చాలా ఇష్టపడి అనేక ఆవులను పెంచుకొంటూ ఉండవచ్చు, కానీ తనకి ఆసక్తి ఉన్న అంశంపై కాకుండా ప్రజలెదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడితే సముచితంగా ఉండేది. 

రోహిత్ వేముల చనిపోయి ఇప్పటికి సుమారు ఏడాది కావస్తోంది. అతని మరణంపై దేశంలో అన్ని రాజకీయ పార్టీలు శవరాజకీయాలు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ నిర్భయంగా వాటిని ఖండించి ఉంటే బాగుండేది. కనీసం ఇన్నాళ్ళలో ఒక్కసారి కూడా రోహిత్ వేముల గురించి మాట్లాడలేదు. రేపు ఆ ‘అంశం’ గురించి ప్రశ్నిస్తానని చెప్పారు. 

అలాగే పఠాన్ కోట్, కాశ్మీర్ ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు, మన సైనికుల తలలు పాక్ సైనికులు నరికి తీసుకుపోయినప్పుడు, కాశ్మీర్ లో మూడున్నర నెలలు రావణకాష్టంలాగ అల్లర్లు చెలరేగి వందల మంది చనిపోతున్నప్పుడు, సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. ఇప్పుడు ‘దేశభక్తి అనే అంశం’ గురించి ప్రశ్నిస్తానని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ‘దేశభక్తి’ అనే అంశంపై బహుశః సినిమా హాళ్ళలో ప్రదర్శనకు ముందు జాతీయగీతం ప్రదర్శించాలనే సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడుతారేమో?

ఇక ఏపికి ప్రత్యేక హోదా అనే అంశం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి అటకెక్కించేసి చాలా నెలలే అయ్యింది. అయినా దానిపై మాట్లడటానికైనా, ప్రశ్నించడానికైన జగన్మోహన్ రెడ్డికే పేటెంట్ హక్కులున్నాయి. ఎందుకంటే, ఆయనకి ఆ విషయంలో చిత్తశుద్ధి ఉన్నా లేకపోయినా కాస్త గట్టిగ పోరాడింది ఆయనే కనుక. నేటికీ పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగుల కారణంగా ప్రత్యేక హోదా గురించి ఏకధాటిగా పోరాడలేకపోతున్నారు.

కనీసం ఈ సంఘటనలు జరిగినప్పుడు కొద్దిగానైనా వాటిపై పవన్ కళ్యాణ్ స్పందించి ఉండి ఉంటే ఇప్పుడు ఈవిధంగా ఎవరూ వేలెత్తి చూపగలిగేవారు కాదు. కానీ ఒక సంఘటన జరిగిన ఏడాది రెండేళ్ళ తరువాత దాని గురించి నిలదీస్తానని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కనుక ఆయన ఎంచుకొన్న ఈ 5 అంశాలలో ఒక్క నోట్ల రద్దు ఒక్కటే సమయోన్చితంగా ఉంది కనుక దాని గురించి అయినా  కాస్త బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడితే బాగుంటుంది.  

అప్రస్తుత విషయాల గురించి అపరిపక్వత ప్రదర్శిస్తూ ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత తనే నవ్వులపాలవుతానని పవన్ కళ్యాణ్ గ్రహిస్తే మంచిది. అసలు ఆయన మొట్టమొదట చేయవలసిన పని అర్జెంటుగా జనసేన పార్టీని నిర్మించుకోవడం. అప్పుడు ఆ పార్టీయే ఆయన ఏమి మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో ఏవిధంగా మాట్లాడాలో అన్ని నేర్పిస్తుంది. 


Related Post