బాబు బంగారం

December 15, 2016


img

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించబోయే ప్రభుత్వ భవన నిర్మాణం కోసం ఇంకా టెండర్లు ఖరారు చేసి పనులు మొదలుపెట్టకముందే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకి బంపర్ ఆఫర్ ప్రకటించారు. రాజధాని నిర్మాణ పనులకి ఉచితంగా ఇసుక, కేవలం రూ.240 కే సిమెంటు అందజేయబోతున్నామని ప్రకటించారు. మాష్టర్ ఆర్కిటెక్ట్ ని ఖరారు చేశామని త్వరలోనే నిర్మాణ పనులు మొదలుపెడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకి రూ.250 కే సిమెంట్ బస్తా అందిస్తామని చెప్పారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఈ ప్రకటన ప్రజలకి సంతోషం కలిగించకపోగా వారిలో అనుమానాలు రేకెత్తిస్తుందని చెప్పక తప్పదు. సాధారణంగా ఏ కాంట్రాక్టరయినా తను చేయబోయే పనిలో బారీగా లాభాలు వచ్చేలాగ లెక్కలు వేసుకొనే టెండర్లు వేస్తాడని అందరికీ తెలుసు. ఈ పనులు చేసినందుకు ప్రభుత్వం నుంచి వారు తగినంత ప్రతిఫలం తీసుకొంటున్నప్పుడు మళ్ళీ వారికి ముఖ్యమంత్రి ఈ బంపర్ ఆఫర్ ఈయవలసిన అవసరం ఏమిటి? ఈ ఆఫర్ ఇచ్చినందుకు వారు ఆ మేరకు తక్కువగా టెండర్లు కోట్ చేస్తారని చెప్పడానికి కూడా లేదు. 

ఇంతవరకు ఏపి సర్కార్ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు చేసిన పనికంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువే బోనసులని మరొకటని చెప్పి చెల్లిస్తోంది. ఆ లెక్కన సుమారు రూ.75,000-1,00,000 కోట్లు వ్యయం అయ్యే రాజధాని నిర్మాణ పనులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకి ఎంత చెల్లించబోతున్నారో ఊహించడం కూడా కష్టమే. పైగా వారికి ఉచిత ఇసుక, మార్కెట్లో సుమారు రూ.350-360 వరకు ధర పలుకుతున్న సిమెంట్ బస్తాని కేవలం రూ.240కే అందించడానికి సిద్దం అవుతున్నారు. ఈ రెండు సబ్సీడీలే కొన్ని వందల కోట్లు రూపాయల విలువ ఉంటాయని చెప్పవచ్చు. 

ఎంపి రాయపాటి సాంబశివరావుకి చెందిన ట్రాన్స్టాయ్ కంపెనీ పోలవరం ప్రాజెక్టులో ప్రధాన కాంట్రాక్టర్ గా దశాబ్దాలుగా పనులు చేస్తూ కోట్లు సంపాదించుకొంది కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏపిలో ఓడిపోవాదం ఖాయమని అలాగే తెదేపా అధికారంలోకి రాబోతోందని పసిగట్టగానే ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెదేపాలో చేరిపోయి తన ఎంపి పదవిని దానితో బాటే పోలవరం కాంట్రాక్టుని కూడా కాపాడుకొన్నారు. 

ఆయనకి లబ్ది చేకూర్చి కమీషన్ల పొందేందుకే తెదేపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అంచనాలని బారీగా పెంచేసిందని వైకాపా ఆరోపిస్తుంటుంది. దాని నిర్మాణ అంచనాలు పెంచడంపై భాజపా నేత పురందేశ్వరి కూడా తరచూ ప్రశ్నిస్తూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ చూసినప్పుడు తెదేపా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ప్రతిపక్షాలే కాదు మిత్రపక్షమైన భాజపా కూడా ఆరోపిస్తోందంటే ఆశ్చర్యం లేదనిపిస్తుంది.


Related Post