తెరాస సర్కార్ మరో మంచి ఆలోచన

December 15, 2016


img

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో అనేక మంత్రిత్వ శాఖలు, వాటి క్రింద అనేక విభాగాలు, మళ్ళీ వాటి క్రింద అనేక ఉప విభాగాలు, మళ్ళీ వాటి క్రింద అనేక చిన్న చిన్న ఉప విభాగాలు, వాటిలో కోట్ల మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. వాటిలో కొన్ని విభాగాల పేర్లు విన్నప్పుడు “అరే! ఇటువంటి విభాగం కూడా ఒకటి ఉందా?” అని ఆశ్చర్యం కలుగుతుంది. 

ఉదాహరణకి మన రాష్ట్ర విద్యాశాఖనే తీసుకొంటే అందులో స్కూల్ ఎడ్యుకేషన్, ఆడల్ట్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, టెక్స్ట్ బుక్స్, పబ్లిక్ లైబ్రేరీస్, జవహార్ బాల భవన్, హైదరాబాద్ సిటీ గ్రంధాలయ సంస్థ, టి.ఆర్.ఈ.ఐ. సొసైటీ మొదలైన విభాగాలున్నాయి. అదేవిధంగా ప్రతీ మంత్రిత్వశాఖ క్రింద ఉండే ఈ విభాగాలలో డజన్ల కొద్దీ ప్రధాన, ఉప విభాగాలు, వాటిలో కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. ప్రభుత్వం సమర్ధంగా పనిచేయడానికి బలమైన వ్యవస్థ చాలా ముఖ్యమే కానీ అదే ప్రభుత్వానికి గుదిబండగా మారిపోకూడదు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు వారాలుగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించినప్పుడు, ఒక్కో విభాగంలో అనేక నిరర్ధకమైన విభాగాలున్నట్లు గుర్తించారు. ఒకపక్క ప్రధాన విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులు తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతుంటే, మరోపక్క ఈ ఉప విభాగాలలో ఉన్నవారు పని లేక కాలక్షేపం చేస్తున్నట్లు గుర్తించారు. అటువంటి ఉప విభాగాల నిర్వహణ, జీతాలు, వాటిలో పని చేసి రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్లు వగైరాల వలన ప్రభుత్వానికి ఏటా సుమారు రూ. 2, 000 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా వేశారు. కనుక అటువంటి నిరర్ధకమైన విభాగాలనన్నిటినీ గుర్తించి వాటిని ప్రధాన విభాగాలలో కలిపివేయడమో లేదా పూర్తిగా తొలగించి దానిలో ఉద్యోగులని పని భారం ఎక్కువగా ఉన్న ఇతర విభాగాలకి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 

దీనిపై అద్యయనం చేసి నివేదిక ఇవ్వవలసిందిగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులని కోరారు. ఆ నివేదిక రాగానే ప్రభుత్వంలోని అన్ని శాఖలలో విభాగాలని కుదించి, అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారు. దీని వలన ప్రభుత్వంపై ఆ మేరకు ఆర్ధిక భారం తగ్గడమే కాకుండా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు వేగంగా అమలు చేయవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 

వాస్తవానికి ఒక్కో విభాగంలో రకరకాల పనులు జరుగుతుంటాయి. ఆ పనులు సులువుగా జరగడానికే ఒక్కో విభాగంలో అనేక ఉప విభాగాలు, వాటిలో వేల మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. కానీ పనులు జాప్యం అవడానికి అదే ప్రధాన కారణమవడం విచిత్రం.

ఇటీవల మంత్రి కేటిఆర్ ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో “మేము అనుకొన్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి. మేము చాలా వేగంగా పనులు పూర్తి చేయాలను కొంటాము కానీ అలాగ జరగడం లేదు. అందుకు ప్రధాన కారణం మన ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న సుదీర్గమైన ప్రక్రియే. ఒక ఫైలు ఒక అధికారి నుంచి మరొక అధికారికి అక్కడి నుంచి మరొక అధికారికి ఇలాగ కదిలే లోగానే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతోంది. ఒకటా..రెండా ఆరు దశాబ్దాలుగా నిర్మించుకొన్న ప్రభుత్వ వ్యవస్థలు మనవి. వాటిని సమూలంగా ప్రక్షాళన చేయడానికి చాలా సమయమే పడుతుంది. ఈ రెండున్నరేళ్ళలో మేము చాలా శాఖలలో నెలకొని ఉన్న ‘స్పీడ్ బ్రేకర్స్’ ని గుర్తించి తొలగించాము. ఇంకా తొలగిస్తూనే ఉన్నాము. ఆ కారణంగా ఇప్పుడిప్పుడే పనులలో కొంచెం వేగం పెరిగింది. కానీ అది ఏమాత్రం సరిపోదు. ఇంకా పెరగాలంటే ఇంకా అనేక స్పీడ్ బ్రేకర్లని తొలగించవలసి ఉంది. మేము అదే పనిలో ఉన్నాము,” అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారని అర్ధం అవుతోంది.


Related Post