రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులే ధర్నా చేస్తే...

December 14, 2016


img

నోట్ల కష్టాలని చూసి సామాన్య ప్రజలే కాదు... హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం వారు హైదరాబాద్ లో రిజర్వ్ బ్యాంక్ ఆవరణలో కొంత సేపు ధర్నా చేశారు. ఆ సందర్భంగా ఉద్యోగుల యూనియన్ నేత రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకి చేరవలసిన కొత్త కరెన్సీ ఏవిధంగా నల్లకుభేరుల తిజోరీలలోకి వెళ్ళిపోతోందో వివరించారు.

“ఇప్పటి వరకు కరెన్సీ ప్రిటింగ్ అయిన తరువాత కరెన్సీ ప్రెస్ నుంచి వివిధ రాష్ట్రాలలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ లకు వచ్చేది. దానిని సరిచూసుకొన్నాక, ఒక లెక్క ప్రకారం అన్ని బ్యాంకులకి మేమే పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు అత్యసర పరిస్థితి సాకుతో ప్రెస్ నుంచి నేరుగా బ్యాంకులకే కరెన్సీ  వెళ్ళిపోతోంది. దానిలో ఎక్కువ భాగం న్యూ జనరేషన్ బ్యాంక్స్ అని చెప్పుకొంటున్న ప్రైవేట్ బ్యాంకులకే వెళ్ళిపోతోంది. నల్లకుభేరుల ఖాతాలన్నీ ఆ బ్యాంక్ లలోనే ఉన్నాయి. అందుకే వారు అవలీలగా అన్ని లక్షల రూపాయలు పట్టుకుపోగలుగుతున్నారు. అందుకు ఉదాహరణగా మొన్న డిల్లీలో యాక్సిస్ బ్యాంక్ లో జరిగిన రూ.100 కోట్ల అక్రమాన్ని చెప్పుకోవచ్చు. కనుక ఈ న్యూ జనరేషన్ బ్యాంక్స్ పై కేంద్రప్రభుత్వం కటినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రజలకి అవసరమైనంత కరెన్సీని తక్షణమే పంపించాలని డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులే బ్యాంకులలో అక్రమాలు జరుగుతున్న తీరుని ఇంత చక్కగా వివరిస్తుంటే, ఆ విషయం కేంద్రప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలియదనుకోలేము. కానీ రోజూ ఇంకా దేశంలో ఎక్కడో ఒక చోట బారీగా కొత్త నోట్లు పట్టుబడుతూనే ఉండటం గమనిస్తే ఈ తప్పుని సవరించుకోలేదనిపిస్తుంది. నల్లధనం వెలికి తీయడానికే పాత నోట్లని రద్దు చేశామని చెపుతూ మళ్ళీ నల్లకుభేరులకే మొట్టమొదట బారీగా డబ్బు మార్చుకొనే అవకాశం కల్పించడాన్ని ఏమనుకోవాలి? అది ఎవరి అసమర్ధత? అందుకు ఎవరిని నిందించాలి? ఎవరు బాధ్యత వహిస్తారు? 


Related Post