మోడీ అవినీతికి ఆధారాలున్నాయిట!

December 14, 2016


img

లోక్ సభలో ఈరోజు కూడా అదే సీన్ రిపీట్ అవడంతో రేపటికి వాయిదా పడింది. తరువాత రాహుల్ గాంధీ పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ “నోట్ల రద్దు వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉంది. దానిలో ప్రధాని నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడినట్లు నిరూపించగల బలమైన ఆధారాలు నావద్ద ఉన్నాయి. నేను మాట్లాడితే మోడీ అవినీతి అంతా బయటపడుతుంది. అందుకే అధికార పార్టీ సభ్యులు నన్ను లోక్ సభ లో మాట్లాడనీయకుండా అడ్డుపడుతున్నారు. సాధారణంగా ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళన చేస్తుంటారు. కానీ లోక్ సభ లో అధికార పార్టీ సభ్యులే పోడియం దగ్గరకి వెళ్ళి సభలో ఈ అంశంపై చర్చ జరుగకుండా నేను మాట్లాడకుండా అడ్డుపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు ఎందుకు రావడం లేదు? ఈ చర్చలో ఎందుకు పాల్గొనడం లేదు? మేము అడగదలచిన ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి ఆయన ఎందుకు భయపడుతున్నారు? ఆయన పార్లమెంటుకి వచ్చి మేము చెప్పిందంతా విని జవాబులు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేమందరం ప్రజలు ఎన్నుకొన్న ఎంపిలం. కనుక వారి తరపున ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించే హక్కు మాకుంది. వాటికి జవాబు చెప్పవలసిన భాద్యత ఆయన మీద ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలకి చెందిన అన్ని పార్టీల ఎంపిలు ఉన్నారు. సభలో మేము అడిగిన వాటికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానాలు చెప్పడానికి సిద్దపడితే మేమందరం బేషరుతుగా ఆయన మాట్లాడటానికి సహకరించడానికి సిద్దంగా ఉన్నామని అందరి తరపున నేను హామీ ఇస్తున్నాను,” అని రాహుల్ గాంధీ అన్నారు.

అయితే ప్రధాని మోడీ ఈ నోట్ల రద్దు ద్వారా ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో రాహుల్ గాంధీ చెప్పలేదు. ఆ విషయం పార్లమెంటులో తనని మాట్లడనిస్తేనే చెపుతానని అన్నారు. కానీ ఆయన మొన్న ముంబైలో ప్రజలని కలిసినప్పుడు మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. 

విజయ్ మాల్యా వంటి బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు లక్షల కోట్లు బ్యాంకులకి ఎగవేశారని, వారు ఎగవేసిన అప్పులని తీర్చడానికే ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎత్తు వేశారని చెప్పారు. అందుకే దేశంలో సామాన్య ప్రజల దగ్గర ఉన్న డబ్బునంతా బ్యాంకులలో జమా చేయించి, దానిని వారు మళ్ళీ వెనక్కి తీసుకోనీయకుండా చేశారని రాహుల్ గాంధీ చెప్పారు. ఆ డబ్బుతో విజయ్ మలయా వంటి వారు చేసిన లక్షల కోట్ల అప్పులు తీర్చాలని మోడీ ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

మోడీ గురించి రాహుల్ గాంధీ చెపుతానంటున్న రహస్యం ఇదే అయితే అంతకంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు. సామాన్య ప్రజల డబ్బుతో వారి అప్పులు తీర్చినట్లయితే అప్పుడు బ్యాంకులు ప్రజలకి ఏవిధంగా దానిని తిరిగి ఇవ్వగలవు? దానిని ప్రజలు బయటకి తీసుకోలేకపోతున్నప్పటికీ దానితోనే నగదు రహిత లావాదేవీలు నిర్వహించగలుగుతున్నారు కదా?

బ్యాంకులకి లక్షల కోట్లు బాకీలు ఎగవేసిన పారిశ్రామికవేత్తల పట్ల మోడీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. వారి బాకీలలో కొన్నిటిని మొండి బకాయిలుగా ప్రకటించేసి వాటిని రద్దు చేసినట్లు ఆ మద్యన మీడియాలో వార్తలు వచ్చాయి. వారిలో విజయ్ మాల్యాకి కూడా సుమారు రూ.1,500 కోట్లు బాకీలు రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. కనుక నోట్ల రద్దు పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలకి సమాధానం చెప్పకపోయినా, లక్షల కోట్లు ఎగవేసిన వారిపట్ల కేంద్రప్రభుత్వం ఎందుకు అంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో తప్పక జవాబు చెప్పవలసిన అవసరం ఉంది.  


Related Post