డిశంబర్ 30 గడువు కూడా కుదిస్తుందా?

December 14, 2016


img

 డిశంబర్ 30వ తేదీతో బ్యాంకులు కూడా రూ.500,1000 నోట్లని స్వీకరించవని అందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లలో ఆ నోట్ల చెల్లుబాటు నిలిచిపోయింది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన కొన్ని ఎంపిక చేసిన చోట్లే రూ.500 నోట్లు ఇంకా తీసుకొంటున్నారు. కానీ డిశంబర్ 15 అర్ధరాత్రి నుంచి అక్కడా కూడా వాటిని తీసుకోరని కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించింది. అప్పటి నుంచి ఆ నోట్లని కేవలం బ్యాంకులలో తమ స్వంత ఖాతాలలో మాత్రమే జమా చేసుకోవలసి ఉంటుంది. డిశంబర్ 30 తరువాత ఆ అవకాశం కూడా ఉండదు. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కౌంటర్లలో వాటికి పూర్తి ఆధారాలు, లెక్కలు చెప్పి మార్చి 31వరకు జమా చేసుకోవలసి ఉంటుంది. దేశంలో సామాన్య ప్రజలందరూ తమ వద్ద ఉన్న పాత నోట్లని ఇప్పటికే తమతమ బ్యాంక్, పోష్టాఫీస్ ఖాతాలలో జమా చేసుకొన్నట్లు రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది కనుక ఏ క్షణాన్నైనా కేంద్రప్రభుత్వం డిశంబర్ 30వ తేదీ గడువును కూడా ముందుకు జరిపి కుదించే అవకాశం కనబడుతోంది. ఒకవేళ కేంద్రప్రభుత్వం ఆవిధంగా చేసినట్లయితే, సామాన్య ప్రజలు ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవచ్చు. పైగా దాని వలన ఈ నోట్ల రద్దు సమస్య ఇంకా ముందుగానే ఒక కొలిక్కి వస్తుంది కూడా. బ్యాంకులు ఎప్పుడైతే పాత నోట్లని స్వీకరించడం మానివేస్తాయో, నల్లధనమంతా చిత్తుకాగితాలుగా మారిపోతుంది గనుక ఆ మరుసటి రోజు నుంచి రిజర్వ్ బ్యాంక్ ఎన్నికోట్లు విలువగల కొత్త రూ.500 నోట్లని బ్యాంకుల ద్వారా ప్రజలకి అందించినా ఎటువంటి నష్టమూ ఉండదు. కనుక కేంద్రప్రభుత్వం డిశంబర్ 30వ తేదీ గడువుని ఎప్పుడైనా కుదించే అవకాశం ఉండనే భావించవచ్చు.  Related Post