ఆ పత్రాలు తీసుకొని కాంగ్రెస్ ఏమి చేస్తుంది?

December 06, 2016


img

డిశంబర్ 9న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం. అంటే కాంగ్రెస్ నేతలు కూడా హాడావుడి చేయవలసిన దినం! కనుక ఆ రోజుని రాష్ట్రమంతటా ఘనంగా కృతజ్ఞతా దినోత్సవం జరుపుకొందామని పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పార్టీ నేతలు, కార్యకర్తలకి పిలుపునిచ్చారు. ఆమె తెలంగాణా రాష్ట్రం ఇచ్చారు కనుక ఆమెకి కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకోవడంలో విచిత్రమేమీ లేదు కానీ నిజానికి ఆ ఖ్యాతిని తమ యూపియే ప్రభుత్వానికి, అప్పటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ కి ఇవ్వాలని అనుకోకపోవడమే చాలా విచిత్రం. అంటే డా.మన్మోహన్ సింగ్ ఒక డమ్మీ ప్రధానమంత్రిని చేసి యూపియే ప్రభుత్వాన్ని సోనియా గాంధీయే నడిపించారని దృవీకరిస్తున్నట్లుంది. ఆ సంగతి అందరికీ తెలిసిందే కనుక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా సోనియా గాంధీయే తెలంగాణా ఇచ్చారని నిసిగ్గుగా, గర్వంగా చెప్పుకొంటున్నారు. 

రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా ఇటువంటి హడావుడి ఏదో ఒకటి చేస్తుండాలి కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమం పెట్టుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతీ నియోజక వర్గం నుంచి కనీసం 20,000 మంది రైతుల నుంచి రుణమాఫీ దరఖాస్తులు తీసుకోవాలని పిలుపునీయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన లేదా కాంగ్రెస్ పార్టీ గానీ వారి రుణాలని తీర్చేయడానికి వాటిని తీసుకోవడం లేదు...ఆ పత్రాలు పట్టుకొని తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించడానికే సేకరించబోతున్నారుట! ఆ తరువాత ఈ నెల 20వ తేదీన ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 

రాష్ట్ర విభజన జరుగక ముందు దేశాన్ని, సమైక్య రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే ఏకధాటిగా పదేళ్ళపాటు పాలించింది. దాని చేతిలో నుంచి తెరాస పగ్గాలు స్వీకరించేనాటికి రాష్ట్రంలో రైతుల పరిస్థితులు ఎంత దయనీయంగా, దారుణంగా ఉన్నాయో  అందరూ కళ్ళారా చూశారు. పైగా విద్యుత్ సంక్షోభం రాష్ట్రాన్ని పట్టి పీడించేది. ఆ కారణంగా బోర్లు ఉన్నా వాటికి కరెంటు లేకపోవడంతో రైతుల కళ్ళ ముందే పొలాలు ఎండిపోతుందేవి. అది చూసి తట్టుకోలేక వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొనేవారు. 

ఆ రోజుల్లో రాష్ట్రంలో పరిశ్రమలకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఉదారంగా పవర్ హాలీడేస్ ప్రకటిస్తుండేది. ఆ కారణంగా అనేక పరిశ్రమలు మూతపడేవి. అప్పుడు వాటిలో పనిచేసే కార్మికులు రోడ్డున పడేవారు. అయితే కాంగ్రెస్ హయంలో అటువంటి పరిస్థితులు ఉండటం చాలా సహజమని ప్రజలు కూడా నమ్మడమే విచిత్రమైన విషయం.  

కాంగ్రెస్ పదేళ్ళ హయంలో చేయలేని ఎన్నో పనులని తెరాస సర్కార్ కేవలం రెండున్నరేళ్ళలో చేసి చూపిస్తుంటే, దానిని జీర్ణించుకోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టమే. అసలు అటువంటి అభివృద్ధి పనుల గురించి కనీసం ఆలోచనలు చేసే అలవాటు కూడా లేకపోవడంతో ఇంకా అజీర్తికి గురవుతోంది. అందుకే తెరాస సర్కార్ చేసిన పనులని పక్కని పెట్టి, అది చేయలేకపోయిన పనులని పట్టుకొని విమర్శించుతోంది. 

అయితే అందుకు తమ పార్టీ అధ్యక్షురాలి జన్మదినం రోజునే ముహూర్తంగా ఎంచుకోవడం విచిత్రంగా ఉంది. రైతుల రుణమాఫీ పత్రాలు పట్టుకొని రోడ్లెక్కి అరవడం వలన ఏమి ప్రయోజనం? కాంగ్రెస్ నేతలకి రైతుల మీద నిజంగా అంత ప్రేమ కారిపోతున్నట్లయితే తమ పార్టీ అధ్యక్షురాలి జన్మదిన కానుకగా అందరూ కలిసి రైతన్నల రుణాలని తీర్చిపడేయొచ్చు కదా! 


Related Post