ఇంకా నోట్ల గందరగోళం దేనికి?

December 05, 2016


img

నోట్ల రద్దు పర్యవసానాలని కేంద్రప్రభుత్వం సరిగ్గా అంచనా వేయలేకపోవడం తప్పు కాదు గానీ ఆ తరువాతైన సమస్యల పరిష్కారం కోసం సమర్ధంగా వ్యవహరించలేకపోవడం అసమర్ధతే అని చెప్పక తప్పదు. దాని వలన  ప్రజలకి నానా కష్టాలు, కేంద్రప్రభుత్వం విమర్శలు ఎదుర్కోకతప్పడం లేదు. ఇప్పుడు కళ్ళముందు కనిపిస్తున్న సమస్యల పరిష్కారం కోసం గట్టిగా ప్రయత్నించవలసిన సమయంలో రూ. 20, 50 నోట్లని ముద్రించబోతున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించి ఇంకా గందరగోళం సృష్టిస్తుండటం చాలా విస్మయం కలిగిస్తోంది. కొత్త నోట్లని కొత్త సిరిస్ తో ముద్రిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న ప్రకటించింది. కొత్తవి అందుబాటులోకి తెచ్చినప్పటికీ, ప్రస్తుతం ఉన్న పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని చెప్పింది. అంటే దేశంలో ఒకే విలువ కలిగిన రెండు రకాల నోట్లు వాడకంలోకి రాబోతున్నట్లు స్పష్టం అవుతోంది. పైగా రిజర్వ్ బ్యాంక్ త్వరలో కొత్త రూ.1,000 నోట్లు కూడా విడుదల చేయబోతున్నట్లు అనధికార సమాచారం వినిపిస్తోంది. అదీగాక ఇప్పటికే దేశంలో కొన్ని చోట్ల కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి వచ్చాయి. 

ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఇన్ని రకాల కొత్త,పాత నోట్లు విడుదల చేస్తుండటం వలన సామాన్య ప్రజలలో ఇంకా గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇదే అదునుగా సంఘవిద్రోహ శక్తులు నకిలీ నోట్లు ముద్రించి, పెద్దగా నిఘాలేని మారుమూల ప్రాంతాలలో, సరిహద్దు ప్రాంతాలలో వాటిని మార్కెట్లలోకి ప్రవేశపెట్టి వాటినే అసలు నోట్లుగా వాడకంలోకి తీసుకువచ్చే ప్రమాదం ఉంది. 

పాత నోట్ల రద్దు చేసి ఇప్పటికే దాదాపు నెలరోజులు పూర్తి కావస్తోంది. కానీ కేంద్రప్రభుత్వం ఇంతవరకు నోట్ల కొరత సమస్యని తీర్చలేకపోయింది. ఇప్పటికీ దేశంలో అనేక ఎటిఎంలు రోజుల తరబడి తెరచుకోవడం లేదు. కొద్ది పాటి డబ్బు కోసం ప్రజలు తమ పనులన్నీ మానుకొని రోజుల తరబడి బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడ వలసి వస్తోంది. నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నప్పటికీ, పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ లో, బారీ స్థాయిలో లావాదేవీలు జరిగే మార్కెట్లలో, పెట్రోల్ బంకులలో స్వైపింగ్ మెషిన్లు కూడా మొరాయిస్తున్నాయి. ఇటువంటి క్లిష్టపరిస్థితులలో కేంద్రప్రభుత్వం ఇంకా ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ప్రజలలో ఎందుకు గందరగోళం సృష్టిస్తోందో డానికే తెలియాలి. పరిస్థితులు ఇలాగే మరికొన్నాళ్ళు సాగినట్లయితే దేశంలో ఏమవుతుందో కూడా ఊహించడం కష్టం. ఒకసారి దేశంలో లేదా ఏదయినా ఒక రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలితే దాని విష పరిణామాలని చక్కదిద్దడం కేంద్రప్రభుత్వం వల్ల కూడా కాదని గ్రహిస్తే మంచిది.   కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసికట్టుగా ఈ నోట్ల కొరత సమస్యలకి సరైన పరిష్కారాలు వీలైనంత త్వరగా కనుగొనడం చాలా మంచిది.  



Related Post