జిల్లాలవారిగా ప్రణాళికలు...గుడ్ ఐడియా!

December 05, 2016


img

ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు చేసినప్పటి నుంచి ప్రతిపక్షాలు ఏవిధంగా విమర్శలు గుప్పిస్తున్నాయో, ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేస్తున్నప్పుడు కూడా అంతకంటే చాలా రకాలుగా విమర్శించారు..అభ్యంతరాలు వ్యక్తం చేశారు..డికె అరుణ వంటివాళ్ళు రోడ్లెక్కి ఆందోళనలు కూడా చేశారు. అతి కొద్ది మంది మాత్రమే దానిని సానుకూల దృక్పధంతో చూడగలిగారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికార నివాసం ప్రగతి భవన్ లో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు తదనంతర పరిస్థితులని సమీక్షించారు. జిల్లాల పునర్విభజన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు 31 జిల్లా కలెక్టర్లతో పూర్తి స్థాయి సమావేశం నిర్వహించలేదు కనుక ఈ నెల 14న వారితో ఒక సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. 

వారివారి జిల్లాలకి సంబంధించి విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలికవసతులు, వ్యవసాయం, నీటి పారుదల, ప్రభుత్వ పధకాల అమలు, బ్యాంకులు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటు వంటి 16 వివిధ అంశాలపై సమగ్ర సమాచారం సేకరించి   సదస్సుకి హాజరవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అదేవిధంగా కేంద్రప్రభుత్వం నిధులతో జిల్లాలలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పధకాలకి ఇంతవరకు వచ్చిన, ఇంకా రావలసిన నిధుల గురించి కూడా సమగ్ర సమాచారంతో జిల్లా కలెక్టర్లు సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. ప్రతీ జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు, సమస్యలు, అవసరాలు, వనరులు ఉంటాయి కనుక రాష్ట్రంలో 31జిల్లాలని 4 యూనిట్లుగా విభజించి, వాటికీ అనుగుణంగానే జిల్లాల వారీగా ప్రణాళికలు, కార్యాచరణని సిద్దం చేయాలని అధికారులని ఆదేశించారు.

అధికారిక వికేంద్రీకరణ సమర్ధంగా జరిగినట్లయితే దానితో రాష్ట్రంలో మారుమూల గ్రామాలని కూడా అభివృద్ధి చెందుతాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇన్ని దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏనాడూ ఆ పని చేయడానికి పూనుకోలేదు. ఎందుకంటే అధికారం వికేంద్రీకరణ చేయడం కంటే, సర్వాదికారాలు తమ గుప్పిట్లో ఉంచుకొంటేనే తమ అధికారం సుస్థిరంగా ఉంటుందని భావించడమే అందుకు కారణం అని చెప్పవచ్చు. కానీ తెరాస సర్కార్ అధికారంలోకి రాక మునుపే జిల్లాల పునర్విభజన చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. చెప్పినట్లుగానే, ఎన్ని అవాంతరాలు ఎదురైనా అన్నిటినీ నిబ్బరంగా ఎదుర్కొంటూ కొత్త జిల్లాల ఏర్పాటు చేసి చూపించారు. అంతటితో తన పని ముగిసినట్లు చేతులు దులుపుకోకుండా, దాని ఉద్దేశ్యం అంటే రాష్ట్రంలో మారుమూల పట్టణాలు, గ్రామాలని కూడా అభివృద్ధి చేయడం కోసం జిల్లాల వారిగా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని ఆలోచించడం చాలా మెచ్చుకోవలసిన విషయమే. అది ఆయన నిజాయితీకి, చిత్తశుద్ధికి అద్దం పడుతోందని చెప్పవచ్చు.        



Related Post