మమతా బెనర్జీకి రోజులు దగ్గర పడ్డాయా?

December 03, 2016


img

ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చేరుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈరోజు మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో టోల్ గేట్స్ వద్ద ఆర్మీ జవాన్ల మోహరింపుని తన ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కుట్రగా ఆమె అభివర్ణించడంపై ఆ రాష్ట్ర గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆరోపణలు తనని కూడా ఉద్దేశ్యించి చేస్తున్నవిగానే ఆయన భావించినట్లున్నారు. అందుకే ఆర్మీపై ఆరోపణలు చేసేటప్పుడు ముఖ్యమంత్రి కాస్త ఆలోచించి మాట్లాడాలని, ఆవిధంగా మాట్లాడటం ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని ఆమె గ్రహించాలని హితవు పలికారు. 

గవర్నర్ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ కూడా అదేవిధంగా స్పందించడం విశేషం. గవర్నర్ కేంద్రప్రభుత్వం ఏజెంట్ లాగ వ్యవహరించకుండా కాస్త పూర్వాపరాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఆమె జవాబిచ్చారు.

ఆర్మీ మోహరింపు చేయడం ద్వారా తన ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి కేంద్రప్రభుత్వం కుట్ర పన్నుతోందని మమతా బెనర్జీ ఆరోపించడమే పెద్ద తప్పని చెప్పవచ్చు. మన దేశంలో కేంద్రప్రభుత్వం ఆర్మీని ఉపయోగించి ఎన్నడూ  రాష్ట్ర ప్రభుత్వాలని కూల్చిన దాఖలాలు లేవు. కనుక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆర్మీపై అటువంటి ఆరోపణలు చేయడం చాలా తప్పు. పైగా టోల్ గేట్స్ వద్ద ఆర్మీ జవాన్లని మొహరించి తనికీలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వమే అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చి, మళ్ళీ ఈవిధంగా మాట్లాడటం, ఆరోపణలు చేయడం ఇంకా తప్పు. ఆమె జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఉబలాటంతో మొదట ఒక తప్పు చేసి దాని నుంచి బయట పడటానికి వరుసగా తప్పులు చేస్తున్నారు. ఆమె ఇంకా ఇలాగే వ్యవహరిస్తుంటే ఆమె వైఖరితో విసిగిపోతున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసి ఆమెని ముఖ్యమంత్రి పదవిలో నుంచి దింపేసినా ఆశ్చర్యం లేదు. 


Related Post