ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన!

December 03, 2016


img

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మరొక సంచలన ప్రకటన చేశారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో  oka బహిరంగ సభలో మాట్లాడుతూ, “నోట్ల రద్దు వలన నల్లధనం దాచుకొన్నవారెవరూ నష్టపోవడంలేదని, అందుకే వారు బ్యాంకులు, ఎటిఎంల దగ్గర క్యూ లైన్లలో నిలబడటం లేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అవును నిజమే! వారు ఎటిఎంల దగ్గర నిలబడటం లేదు. ఎందుకంటే వాళ్ళిప్పుడు సామాన్యులు, నిరుపేదల ఇళ్ళ ముందు నిలబడుతున్నారు గనుక. మా దగ్గర ఉన్న నల్లధనం మీ బ్యాంక్ ఖాతాలలో వేసుకొంటారా...మీకు దానిలో కొంత కమీషన్ ఇస్తామని బ్రతిమాలుకొంటున్నారు. ఇలాంటి సన్నివేశం మీరెప్పుడైనా జీవితంలో చూశారా?” అని మోడీ ప్రజలని ప్రశ్నించారు. దానికి సభకి హాజరైన ప్రజల స్పందన ఏవిధంగా ఉంటుందో చాల తేలికగానే ఊహించవచ్చు.    

ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీ సంచలనమైన మాట ఒకటి చెప్పారు. “ఈసారి ఎవరైనా మీ ఖాతాలలో డబ్బు వేసినట్లయితే దానిని బయటకి తీసి వారికి తిరిగి ఇవ్వకండి. అది మీదే...అది మీకే చెందుతుంది. ఒకవేళ ఎవరైనా బలవంతం చేస్తే మీరే వాళ్ళని ఎదురు ప్రశ్నించండి. ఇంకా బలవంతం చేస్తే ప్రధానమంత్రికే పిర్యాదు చేస్తామని చెప్పండి. వాళ్ళ సంగతి నేను చూసుకొంటాను. అందరినీ జైళ్ళకి పంపిస్తాను. ఆ డబ్బు మీ ఖాతాలోనే ఉన్నట్లయితే అది అవినీతిపరుల జాడని పసిగట్టేందుకు ప్రభుత్వానికి పనికివస్తుందని గుర్తుంచుకొని సహకరించండి,” అని మోడీ చెప్పడం విశేషం.

ఒకపక్క కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ఆదాయపన్నుశాఖలు ఇతరుల డబ్బుని మీ ఖాతాలలో వేసుకోవద్దని మీడియా ద్వారా ప్రజలని హెచ్చరిస్తుంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఈవిధంగా చెప్పడం చాల ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే పేద, సామాన్య ప్రజలు నల్లధనాన్ని తమ ఖాతాలలో వేసుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ సూచిస్తున్నారా? మరి అలాగయితే ఆదాయపన్ను శాఖ ఆవిధంగా హెచ్చరికలు చేయడం ఎందుకో? అయినా ఇప్పటికే సుమారు రూ. 65,000 కోట్లకి పైగా నల్లధనం జనధన్ ఖాతాలలో జమా అయ్యిందని రిజర్వ్ బ్యాంక్ లెక్కలు చెపుతున్నప్పుడు, ఆ డబ్బుని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమో లేకపోతే స్తంభింపజేయడమో చేసి ఉండి ఉంటే, దానిని జమా చేస్తున్నవారు భయపడి ఉండేవారు. కానీ ఆదాయపన్ను శాఖా ఒక విధంగా ప్రధాని నరేంద్ర మోడీ మరొకవిధంగా చెప్పడం వలన ప్రజలలో అయోమయం సృష్టించినట్లు అవుతోందని గ్రహిస్తే మంచిది.


Related Post