మమతకి భంగపాటు తప్పదేమో?

December 02, 2016


img

నోట్ల రద్దు విషయంలో కేంద్రప్రభుత్వంతో గొడవపడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇప్పుడు టోల్ గేట్ల వద్ద ఆర్మీ మోహరింపుపై గొడవ పడుతున్నారు. రాష్ట్రంలో టోల్ గేట్స్ వద్ద ఆర్మీని మొహరించినందుకు నిరసనగా ఆమె నిన్న రాత్రి నుంచి సచివాలయంలో తన ఛాంబర్ లో తలుపులు బందించుకొని కూర్చొన్నారు. ఆమె విచిత్ర వైఖరి చూసి ప్రజలు కూడా విస్తుపోతున్నారు. 

ఆమె తమపై ఆరోపణలు చేయడం చూసి, టోల్ గేట్స్ వద్ద ఆర్మీ మోహరింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం తమకిచ్చిన అనుమతి పత్రాలని ఆర్మీ అధికారులు ఈరోజు బయటపెట్టారు. సాధారణంగా ప్రతీ ఏటా తమ అభ్యాసం కోసం ఈవిధంగా చేస్తుంటామని, దాని కోసం ముందుగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖలు వ్రాసి అన్ని అనుమతులు తీసుకొంటామని ఆర్మీ అధికారులు తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలని వారు బయటపెట్టినప్పటికీ మమతా బెనర్జీ మొండి పట్టుదలతో వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె ఈరోజు సాయంత్రం కేంద్రప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. టోల్ గేట్స్ వద్ద నుంచి తక్షణం ఆర్మీని తొలగించకపోతే, కేంద్రప్రభుత్వాన్ని కోర్టుకి ఈడుస్తానని హెచ్చరించారు. కానీ కేంద్రప్రభుత్వం ఆమె హెచ్చరికలని పట్టించుకోలేదు. 

ఒకవేళ ఆమె కోర్టుకి వెళ్ళినట్లయితే ఆర్మీ అధికారులు తమ వద్ద ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలని కోర్టుకి సమర్పిస్తారు కనుక అప్పుడు కోర్టు చేత ఆమే చివాట్లు తినక తప్పదు. ఈ సంగతి ఆమెకి తెలియదనుకోవాలా లేక తెలిసీ కేంద్రప్రభుత్వంపై బురద జల్లుతూ ప్రజల సానుభూతి పొందాలనే ఉద్దేశ్యంతోనే ఈ డ్రామాలు ఆడుతున్నారనుకోవాలా? ఆమె ఒక సమస్య నుంచి బయటపడటానికి మరొక సమస్య సృష్టించుకొంటున్నారని చెప్పవచ్చు. కనుక ఈ వ్యవహరంలో ఆమెకి భంగపాటు తప్పక పోవచ్చు. 


Related Post