బ్యాంకులకి మరో అగ్నిపరీక్ష

November 30, 2016


img

నోట్ల రద్దు, దాని తదనంతర పరిణామాల కారణంగా దేశంలో సామాన్య ప్రజలే కాదు..వారికి తగినంత డబ్బు అందించలేక అన్ని బ్యాంకుల సిబ్బంది కూడా చాలా కష్టాలు పడుతున్నారు. చాలా చోట్ల వారు కూడా ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఇప్పుడు వారికి మరొక అతిపెద్ద అగ్ని పరీక్ష ఎదుర్కోవలసి ఉంది. అదే అకౌంట్లు లేని వారందరికీ కొత్త అకౌంట్లు అత్యవసరంగా తెరవవలసి రావడం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులు అందరికీ డిశంబర్ నెలలో బ్యాంకుల ద్వారా జీతాలు చెల్లించడం. 

దేశావ్యాప్తంగా కొన్ని కోట్లు మంది ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో చాలా మందికి సదరు సంస్థలు పే-స్లిప్ పద్దతిలో నగదు రూపంలో జీతాలు చెల్లిస్తుంటాయి. కనుక వారిలో చాలా మంది ఇంతవరకు బ్యాంక్ అకౌంట్లే ఏర్పాటు చేసుకోలేదు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులలో వారికి యధాప్రకారం నగదు రూపంలో జీతాలు చెల్లించడం సాధ్యం కాదు కనుక అందరినీ బ్యాంక్ అకౌంట్ తెరుచుకోవాలని ప్రైవేట్ సంస్థలు కోరుతున్నాయి. దానితో దేశంలో కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులు అందరూ అత్యవసరంగా బ్యాంక్ అకౌంట్లు ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. 

ఒకేసారి కోట్లమందికి కొత్త ఖాతాలు తెరవడానికి సిబ్బంది, సంబంధిత దరఖాస్తు ఫారంలు, ఖాతాలు తెరవడానికి ఏర్పాట్లు చేసుకోవడం బ్యాంకులకి కూడా చాలా కష్టమే. కొత్త ఖాతాలు తెరిస్తే తప్ప ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకి జీతాలు చేతికి అందవు కనుక వారు కూడా బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి చేయకుండా ఉండరు. ప్రజలకి నోట్లు అందించలేక ఇప్పటికే నానా అవస్థలు పడుతున్న బ్యాంకులకి ఇది నిజంగా అగ్ని పరీక్షే కాబోతోంది. 

ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ నెలలో అందరికీ జీతాలు అందిన తరువాత అంటే 8న నోట్ల రద్దు ప్రకటన చేశారు కనుక అప్పుడు ఏమీ ఇటువంటి ఇబ్బంది ఎదురవలేదు. అప్పుడే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకర్లు, ఆర్ధిక నిపుణులు ఎవరూ కూడా డిశంబర్ నెలలో ఇటువంటి సమస్య ఎదురవుతుందని ఊహించకపోవడం చాలా విచిత్రంగానే ఉంది. 

కనుక ఈ డిశంబర్ నెల సామాన్య ప్రజలకి, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకి, రిజర్వ్ బ్యాంక్ కి, దేశంలో అన్ని బ్యాంకులకి అగ్ని పరీక్ష కాబోతోంది. ఈ సమస్య తీవ్రత, దాని ప్రభావాలని ఊహించడం కూడా కష్టంగా ఉంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఈ సమస్యని ఏవిధంగా ఎదుర్కొంటాయో చూడాలి.


Related Post