ప్రజలకి నచ్చితే అధికారంలో ఉంటాం లేకుంటే లేదు: కేటిఆర్

November 29, 2016


img

మంత్రి కేటిఆర్ తాజా ఇంటర్వ్యూలో ‘హరీష్ రావుతో మీకు విభేదాలు ఉన్నమాట నిజమేనా?’ అనే ప్రశ్నకి సమాధానమిస్తూ “మేమిద్దరం ఒకే కుటుంబానికి చెందినవారం. యువకులం. మా మద్య ఆరోగ్యకరమైన పోటీయే ఉంది తప్ప ఎటువంటి విభేదాలు లేవు,” అని స్పష్టం చేశారు. 

మీ ప్రభుత్వంలో నెంబర్: 2 స్థానం ఎవరిది అనే ప్రశ్నకి సమాధానమిస్తూ “మా ప్రభుత్వంలో నెంబర్: 1 స్థానం ఉంది కానీ నెంబర్: 2 స్థానం లేదు. కేసీఆర్ దే ఆ నెంబర్: 1 స్థానం. మిగిలిన వారందరం ఆయన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించడమే తప్ప ఆయన తరువాత స్థానం ఎవరిది అని ఎన్నడూ ఆలోచించం. నేటి రాజకీయాలలో 60 ఏళ్ళ వయసంటే పెద్దదేమీ కాదు కనుక ఆయనే మరో 15 ఏళ్ళ వరకు మాకు బాస్. కనుక ఆయన తరువాత స్థానం ఎవరిది అని ఆలోచించడం కూడా తప్పు. అయినా జీవితాంతం  మేమే అధికారంలో ఉంటామని ఎన్నడూ అత్యాశకి పోము. మా అదృష్టం కొద్ది ప్రజలు మాకీ అవకాశం ఇచ్చారు. మా పరిపాలన వారికి నచ్చితే మళ్ళీ అధికారంలోకి వస్తాము. వారు వద్దనుకొంటే ఇంట్లో కూర్చోంటాం. ఎవరికైనా ఇది తప్పదు. తెలంగాణా సాధన కోసం పోరాడిన మాకు ఈ అవకాశం ఒక బోనస్ వంటిదే. కనుక దానిని సద్వినియోగపరుచుకొని యధాశాక్తిన ప్రజలని మెప్పించేందుకు ప్రయత్నిస్తాము. ప్రజలే అంతిమ నిర్ణేతలు మేము కాదు,” అని అన్నారు.

‘కేసీఆర్ నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తుంటారు కదా’ అనే ప్రశ్నకి సమాధానం ఇస్తూ “అది తప్పు. ఆయన తీరుని నిశితంగా గమనిస్తున్నవారికి ఆయన ఎటువంటివారో అర్ధం అవుతుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు. దానిపై ప్రజాభిప్రాయం తెలుసుకొంటారు. వ్యతిరేకంగా ఉన్నట్లయితే దానిని విరమించుకొనడానికి సిగ్గు పడరు. అదే నిజమైన ప్రజాస్వామ్యవాది లక్షణం అంటే,” అని అన్నారు. 

నోట్ల రద్దుపై అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం ఇస్తూ “ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. దానిని మేము వ్యతిరేకించడం లేదు కానీ దాని తదనంతర పరిణామాలని వీలైనంత త్వరగా చక్కదిద్దాలని మాత్రమే కోరుకొంటున్నాము. చెరువులో మొసలి ఉందని దానినిపట్టుకోవడానికి చెరువుని ఎండబెట్టి దానిలో చేపలని చంపుకోలేనట్లే, నల్లధనం అరికట్టడానికి నోట్ల రద్దు చేసినప్పుడు సామాన్య ప్రజలని దానికి బలి కాకుండా చూసుకోవాలని మేము చెపుతున్నాము అంతే!” 

“నోట్ల రద్దు నిర్ణయం యొక్క ప్రయోజనం నెరవేరాలంటే దానిని రహస్యంగా ఉంచవలసిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. అలాగే ఉంచారు కూడా. ఆరోజు ఉదయం నేను డిల్లీలో చాలా మంది పెద్దలని, అధికారులని ఇతర పనుల మీద కలిశాను. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా నోట్ల రద్దు గురించి తెలిసినట్లు మాట్లాడలేదు. కనుక దాని గురించి కొంతమందికి ముందే చెప్పారని, చంద్రబాబు నాయుడు అందుకే అన్నీ సర్దుకొన్నారనే ఆరోపణలలో నిజం లేదు. అయితే నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తరువాత అయినా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులు అందరినీ అత్యవసరంగా సమావేశపరిచి, వారితో దీని గురించి చర్చించి, వారి వద్ద నుంచి తగిన సలహాలు, సహకారం తీసుకొని ఉండాల్సిందని నేను అభిప్రాయపడుతున్నాను,” అని అన్నారు.

నోట్ల కష్టాల గురించి మాట్లాడుతూ “భారతీయులుగా మన దేశం కోసం ఆ మాత్రం కష్టం, నష్టం భరించడానికి మేము ఎప్పుడూ సిద్దమే. కానీ ఈ సమస్యలు ఎప్పటిలోగా పరిష్కరించగలరు? దానికి ఏమేమి చర్యలు తీసుకొంటున్నారు? అని కేంద్రప్రభుత్వం ప్రజలకి వివరించవలసి ఉందని చెపుతున్నాము. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు దాని వలన ఎటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి? వాటిని ఏవిధంగా పరిష్కరించవచ్చనే విషయాలన్నీ ప్రధాని మోడీకి వివరించారు. ఈ సమస్యలని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం యధాశాక్తిన కృషి చేస్తోంది. కేంద్రప్రభుత్వానికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తోంది కూడా,” అని కేటిఆర్ చెప్పారు.  



Related Post