నల్లధనంపై యుద్ధంలో మరో ముందడుగు

November 29, 2016


img

నల్లధనం పై మోడీ ప్రభుత్వం మొదలుపెట్టిన యుద్ధంలో ఈరోజు మరో ముందు అడుగు పడింది. నల్లధనం ఉన్నవారు నేటికీ దానిని వైట్ గా మార్చుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. పాత నోట్ల మార్పిడికి డిశంబర్ 31 వరకు గడువు ఉన్నందున ఆలోగా వివిధ మార్గాలలో దానిని మార్చుకొనే ప్రయత్నాలు చేస్తుండటంతో, ప్రధాని నరేంద్ర మోడీ వారిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్దం అవుతున్నారు. 

నల్లధనం ఉన్నవారు డిశంబర్ 31 లోగా స్వచ్చందంగా ప్రకటిస్తే 50 శాతం పన్ను, ఆ తరువాత ఆదాయపన్ను శాఖ దాడులలో పట్టుబడితే పన్ను, జరిమానాలు అన్ని కలుపుకొని ఏకంగా 73 శాతం వసూలు చేసేందుకు వీలుగా ఆదాయపన్ను చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ మొన్న కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. దానిని ఈరోజు లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. 

ప్రతిపక్షాలు దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసి చర్చ జరుపాలని పట్టుబట్టాయి కానీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వారి అభ్యర్ధనలని తిరస్కరించి మూజువాణి ఓటింగ్ ద్వారా ఆ బిల్లుకి లోక్ సభ ఆమోదముద్ర వేసినట్లు ప్రకటించారు. 

అయితే మోడీ ప్రభుత్వానికి రాజ్యసభలో తగినంత సంఖ్యా బలం లేదు కనుక అక్కడ ఈ బిల్లుని ఆమోదింపజేసుకోవడానికి వాటి సహకారం చాలా అవసరమే. దానికీ మోడీ వద్ద వ్యూహం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో డిఎంకె, అన్నాడిఎంకె, జెడియూ సభ్యుల మద్దతుతో దీనిని ఆమోదింపజేసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సమావేశాలలోనే రాజ్యసభలో ఈ బిల్లుని ఆమోదింపజేసుకోగలిగితే, నేటికీ నల్లధనం  దాచుకొన్నవారు అర్జెంటుగా దానిని బీదసాదలకి దానధర్మాలు చేయడం మొదలుపెట్టక తప్పదు. లేకుంటే మొత్తం ఊడ్చిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.


Related Post