ఉపసంఘంపై అప్పుడే విమర్శలు, లుకలుకలు!

November 29, 2016


img

నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన సంక్షోభానికి పరిష్కారాలు సూచించడానికి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన ఉపసంఘాన్ని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకొంది. దానిలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి  పి. నారాయణ సామి కూడా ఒకరు. కానీ ఆయన దానిలో చేరలేనని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి తెలిపారు. 

పి. నారాయణ సామి కాంగ్రెస్ పార్టీ సభ్యుడని అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటు లోపలా బయటా నిరసనలు తెలుపుతుంటే, ఆయన ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడుగా చేరినట్లయితే, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి అవలంభిస్తున్నట్లు అవుతుంది. అందుకే ఆయన పార్టీ అధిష్టానం సూచన మేరకు ఆ కమిటీలో సభ్యుడిగా కొనసాగకూడదని నిర్ణయించుకొన్నారు. 

ఇక చంద్రబాబు నాయుడుని ఈ ఉపసంఘానికి చైర్మన్ గా నియమించడంపై వైకాపా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సాక్షి మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబుకి నోట్ల సమస్యలని పరిష్కరించమని కోరడం అంటే దొంగ చేతికే తాళాలు యిచ్చినట్లుంది. ఓటుకి నోటు కేసులో స్వయంగా డబ్బు మూటలు కట్టి రేవంత్ రెడ్డి చేత తెరాస ఎమ్మెల్యేకి పంపించిన ఆయనకి కేంద్రప్రభుత్వం ఇటువంటి ముఖ్యమైన బాధ్యత అప్పగించడం చాలా విడ్డూరంగా ఉంది. ఆయనకి ప్రతీ దానిని ఏవిధంగా మేనేజ్ చేయాలో చాలా బాగా తెలుసు కనుకనే ఈ నోట్ల రద్దు కారణంగా మోడీ ప్రభుత్వం పడిన అపవాదుని మరొకరి నెత్తిన రుద్దడానికే ఆయనకి ఈ భాద్యత అప్పగించి ఉండవచ్చు,” అని విమర్శించారు. 

ఈ కమిటీ గురించి మరొక ఆసక్తికరమైన విమర్శ కూడా వినిపిస్తోంది. ఈ నోట్ల రద్దు పర్యవసానాలతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా ఆగ్రహంగా ఉన్నారని కనుక వారందరితో సమావేశం ఏర్పాటు చేసి, ఈ సమస్యలని అధిగమించడానికి ప్రధాని నరేంద్ర మోడీ అందరి సహాయసహకారాలు కోరితే మంచిదని కేసీఆర్ సూచిస్తే మోడీ కేసీఆర్ ని చాలా మెచ్చుకొన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందరు ముఖ్యమంత్రులతో కాకుండా కేవలం 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే కమిటీ వేయాలనుకోవడం ఒక తప్పు అయితే, ప్రధానమంత్రికి మంచి సలహా ఇచ్చిన కేసీఆర్ ని పక్కనబెట్టి చంద్రబాబు నాయుడుని చంకనెక్కించుకొన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.


Related Post