ఛాయ్ వాలాయే నయం కదా?

November 29, 2016


img

మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్ధికవేత్త అని అందరికీ తెలుసు. ఆయన మొన్న రాజ్యసభలో  మాట్లాడుతూ “దేశంలో 60 శాతం మంది ప్రజలకి బ్యాంక్ ఖాతాలే లేనప్పుడు నగదు రహిత లావాదేవీలు ఏవిధంగా నిర్వహిస్తారని కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నోట్ల రద్దుతోనే దేశంలో నల్లధనం అంతా వెలికి తీయడం సాధ్యం కాదని వాదించారు. ఈ అంశంపై ఆయన ఇంకా చాలా మాట్లాడారు.  

నిజమే! దేశంలో నేటికి కోట్లాది మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. కారణం పేదరికమే. కనుక నగదు రహిత లావాదేవీలు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. 

నిజమే! నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించే ముందు మోడీ ప్రభుత్వం తగిన ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలం అయ్యింది. ఆ కారణంగా దేశంలో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న మాట కూడా వాస్తవమే. కనుక డా. మన్మోహన్ సింగ్ మోడీని ప్రశ్నించడం సబబే.

అయితే డా. మన్మోహన్ సింగ్ 1972-2014 వరకు వివిధ హోదాలలో దేశ ఆర్ధిక వ్యవస్థని నడిపించారు. అంటే సుమారు 42 సం.లన్న మాట! మరి అన్నేళ్ళలో ఆయన ఇటువంటి విప్లవాత్మకమైన ఆలోచనలు ఎందుకు చేయలేకపోయారు? కనీసం దేశ ప్రజలందరికీ బ్యాంక్ ఖాతాలు ఉండే విధంగా సంస్కరణలు ఎందుకు చేపట్టలేకపోయారు? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

ఆయన 1972 నుంచి 76 వరకు ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారుగా సేవలు అందించారు. 1982-85 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. 1985-87వరకు ప్లానింగ్ కమీషన్ చైర్మన్ గా పనిచేశారు. 1991-95వరకు దేశ ఆర్దికమంత్రిగా వ్యవహరించారు. 2004-2014 వరకు అంటే 10 ఏళ్ళపాటు ప్రధానమంత్రిగా దేశాన్ని పాలించారు. 

ఆయన 42 సం.లలో చేయలేని ఈ పనులన్నిటినీ, ఒక ‘ఛాయ్ వాలా’ నరేంద్ర మోడీ కేవలం రెండున్నరేళ్ళలోనే చాలా వరకు చేసి చూపిస్తున్నారు. ఒక గొప్ప ఆర్ధికవేత్త చేయలేని పనులన్నిటినీ ఒక సాధారణ ఛాయ్ వాలా చేసి చూపిస్తుంటే అందుకు మెచ్చుకోకపోగా విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

మోడీ అధికారం చేపట్టి ఇంకా రెండున్నరేళ్ళు మాత్రమే అయ్యింది. ఇంత తక్కువ సమయంలోనే ‘జన్ ధన్’ పధకం క్రింద దేశంలో 25కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు తెరిపించగలిగారు. అది కూడా చాల దూరదృష్టితో చేసినదేనని ఇప్పుడు రుజువు అవుతోంది. దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన రెండేళ్ళ క్రితమే నిరుపేదల చేత బ్యాంక్ ఖాతాలు తెరిపింపజేసినట్లు ఇప్పుడు అర్ధం అవుతోంది. 

ఒక సాధారణ ఛాయ్ వాలా ఇన్ని సంస్కరణలు, ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని, వాటిని ధృడంగా అమలుచేస్తుంటే, గొప్ప ఆర్ధికవేత్తగా పేరొందిన డా.మన్మోహన్ సింగ్ ఆయనని సమర్ధించకపోగా విమర్శిస్తున్నారు. మోడీని అయన సమర్ధించకపోయినా పరువాలేదు కానీ విమర్శించడం ఎందుకు? ఆయన ఆత్మవిశ్వాసం దెబ్బ తీయాలని ప్రయత్నించడం ఎందుకు?


Related Post