మోడీ చెప్పిందే చేస్తారు!

November 28, 2016


img

ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని రోజుల క్రితం గోవాలో ఒక సభలో ప్రసంగిస్తూ నేను చెప్పిందే చేస్తానని అన్నారు. నల్లధనం వెలికి తీస్తానని చెప్పానని, దాని కోసం చర్యలు చేపట్టినప్పుడు కూడా చాలా మంది నమ్మలేదని, కానీ ఇప్పుడు తాపీగా బాధపడుతున్నారని అన్నారు. నల్లధనం వెలికితీతపై తన పోరాటం ఇంకా ఉదృతం చేస్తానని గోవాలో చెప్పారు. చెప్పినట్లుగానే ఈరోజు ఆ దిశలో మరో ముందడుగు వేశారు. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు లోక్ సభలో ఆదాయపన్ను చట్ట సవరణలు ప్రతిపాదిస్తూ ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. డానికి పార్లమెంటు ఆమోదముద్ర పడితే నల్లధనం ఉన్నవారు ఇక దానిపై పూర్తిగా ఆశలు వదులుకోవలసిందే. ఆ బిల్లులో ముఖ్యాంశాలు:

నల్లధనం ఉన్నవారు దాని గురించి ఆదాయపన్ను శాఖకి తెలియబరిస్తే, దానిపై 50 శాతం పన్ను విదిస్తారు. మిగిలిన  50 శాతంలో సదరు వ్యక్తులకి 25 మాత్రమే ఇచ్చి మిగిలిన 25శాతాన్ని కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకొంటుంది. దానిని నాలుగేళ్ళపాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పధకాంలో పెడతారు. ఆ నాలుగేళ్ళలో ప్రభుత్వం సదరు వ్యక్తులకి ఎటువంటి వడ్డీ చెల్లించబోదు.

ఇక నల్లధనం గురించి ప్రకటించనివారి దగ్గర దొరికిన దానిపై అన్ని పన్నులు,. జరిమానాలు, సర్ చార్జీలు కలుపుకొని మొత్తం 73శాతం వసూలు చేస్తుంది. ఈ దాడులలో ఆదాయపన్ను అధికారి విచక్షణ మేరకు మరో 10శాతం వరకు జరిమానా వేసేందుకు కూడా ఈ బిల్లులో వీలుకల్పిస్తున్నారు. అంటే అన్ని కలుపుకొని సుమారు 83 శాతం వరకు ఉండబోతోందన్న మాట! అంటే ఒక కోటి రూపాయలు నల్లధనం ఉంటే అందులో 83 లక్షల వరకు ఒకే దెబ్బతో ఊడ్చుకుపోతుందన్నమాట! నల్లధనం గురించి ముందుగానే ఆదాయపన్ను శాఖకి చెప్పుకొంటే 25 శాతం మిగులుతుంది లేకుంటే 17శాతం మాత్రమే మిగులుతుందన్నమాట! అంటే ఎట్టి పరిస్థితులలో కూడా నల్లధనం ఉన్నవారు దానిని దాదాపు వదులుకోక తప్పదన్న మాట! 

ఈ బిల్లుని ఈ సమావేశాలలోనే పార్లమెంటు చేత ఆమోదముద్ర వేయించి వీలైనంత త్వరగా అమలులోకి తీసుకురావాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. కానీ దీనికి ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా? అంటే అనుమానమే. ఈ బిల్లుకి పార్లమెంటు ఆమోదముద్ర పడితే మాత్రం ఇక దేశంలో నల్లధనం పోగేసుకొన్నవారికి మూడినట్లే అని చెప్పవచ్చు. 

ఇక స్విస్ బ్యాంకులలో దాచిన నల్లధనాన్ని భారత్ తిరిగి రప్పించేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి. స్వీడన్ దేశంతో కుదుర్చుకొన్న ఒక ఒప్పందం ప్రకారం స్విస్ బ్యాంకులలో భారతీయుల ఖాతాల వివరాలు సేకరించగలుగుతోంది. కనుక అక్కడ నుంచి కూడా భారత్ కి బారీగా నల్లధనం తరలివచ్చే అవకాశం ఉంది. 


Related Post