కేసీఆర్ కి అది అవసరమా? కోదండరామ్ ప్రశ్న

November 28, 2016


img

“ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఒక అధికారిక నివాసం ఉండగా మళ్ళీ 8 ఎకరాలలో రూ.50 కోట్లు ఖర్చు పెట్టి మరో కొత్త ఇల్లు కట్టుకోవలసిన అవసరం ఏమిటి?” అని తెలంగాణా జేయేసి చైర్మన్ ప్రొఫెసర్  కోదండరామ్ ప్రశ్నించారు. 

“ముఖ్యమంత్రి ఇంతరకు ఉన్న క్యాంప్ ఆఫీసులో అన్ని హంగులు ఉన్నాయని విన్నాను. అక్కడి నుంచే రాష్ట్ర ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడేందుకు అత్యాధునికమైన వ్యవస్థ కూడా ఉందని విన్నాను. ఒకవేళ అవసరం అనుకొంటే దాని పక్కనే మరో బ్లాకు నిర్మించుకొంటే సరిపోయేది. అయన నమ్మకాలని ఎవరూ కాదనరు. ఒకవేళ అయనకి ఆ భవనం సరిపడదనుకొంటే నగరంలో అనేక ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. వాటిలో దేనినో ఒకదానిని ఉపయోగించుకోవచ్చు కదా? కానీ వాటిని కాదని రూ.50 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఇల్లు కట్టుకోవలసిన అవసరం ఏమిటి?” అని ప్రొఫెసర్  కోదండరామ్ ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా ఆయన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ప్రస్తావన కూడా చేశారు. “ముఖ్యమంత్రి కొత్త ఇంటిని ఏడాదిలోగా కట్టగలిగినప్పుడు, రెండున్నరేళ్ళవుతున్నా పేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎందుకు కట్టించలేకపోతున్నారు? ముఖ్యమంత్రి తలుచుకొంటే పేదలకి ఇళ్ళు కట్టించడం అసాద్యమా?ప్రభుత్వం ముందు తన ప్రాధాన్యతలు ఏమిటో తెలుసుకోవాలి. పేదలకి ఇళ్ళు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు ముందుగా వాటిని కట్టించి ఇవ్వాలి కానీ ముఖ్యమంత్రి తన కోసం రూ. 50 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి కొత్త ఇల్లు కట్టుకొన్నారు. అది సరికాదని నేను భావిస్తున్నాను,” అని ప్రొఫెసర్  కోదండరామ్ అన్నారు. 

ముఖ్యమంత్రి కొత్త ఇల్లు కట్టుకోవడంపై ప్రొఫెసర్  కోదండరామ్ ఒక్కరే కాదు..రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విమర్శిస్తూనే ఉన్నాయి. కానీ ఆయన వాటిని పట్టించుకోవడం లేదు. ఒకపక్క రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో బాలికలకి మరుగుదొడ్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి నివాసంలో మరుగుదొడ్లకి కూడా బులెట్ ప్రూఫ్ అద్దాలు బిగించారు. ముఖ్యమంత్రి ఒక నవాబులాగ, రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు. అది నిజమే అనుకోవాలేమో!


Related Post