అక్కయ్య హడావుడి అందుకేనా?

November 28, 2016


img

‘మమతా దీదీ’ అంటే మమత అక్కయ్య గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆమె చాలా శక్తివంతమైన ఒక విద్వంసక క్షిపణి వంటిది. ఏదైనా ఒక అంశంపై ఆమె ఉద్యమిస్తే ఎదుటవాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా తోక ముడిచి పారిపోవలసిందే. పదేళ్ళ క్రితం టాటా సంస్థ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సింగూరులో నానో కార్ల తయారీ సంస్థ ఏర్పాటు చేయాలనుకొంది. కానీ అక్కయ్య దెబ్బకి జడిసి దానిని గుజరాత్ కి తరలించుకుపోవలసి వచ్చింది. ఇప్పుడు ఆమె నోట్ల రద్దు అంశం అందిపుచ్చుకొని మోడీ ప్రభుత్వంపై ఉద్యమిస్తోంది. మరి ఆమె ధాటికి మోడీ తట్టుకొని నిలబడతారో లేదో కాలమే చెపుతుంది. అయితే ఆమె ఈ విషయంలో ఇంత హడావుడి ఎందుకుకు చేస్తున్నారు? అనే సందేహం కలుగుతోంది. 

మనదేశంలో ప్రధానమంత్రి పదవిపై కనీసం రెండు డజన్ల మంది రాజకీయ నేతలు కన్నేసినవారున్నారు. వారిలో ఆమె కూడా ఒకరు. ఇంతవరకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ రేసులో ముందు ఉండేవారు. కానీ ఆయన అకస్మాత్తుగా వెనక్కి తగ్గడంతో మమత అక్కయ్య ఆ స్థానం కోసం ముందుకు దూసుకువచ్చినట్లున్నారు. ఇది యావత్ దేశ ప్రజలందరికీ సంబంధించిన సమస్య కనుక దీనిపై గట్టిగా పోరాడితే అందరి దృష్టి ఆకర్షించడం తేలిక అని అక్కయ్య భావిస్తున్నారేమో? ప్రస్తుతం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్, వామపక్షాలతో సహా అన్నీ అంగీకరించాయి కనుక ఒకవేళ తాను ప్రధానమంత్రి పదవికి పోటీ పడినట్లయితే వాటిలో చాలా పార్టీలు తనకి తప్పకుండా మద్దతుఈయవచ్చని ఆమె ఆశ పడుతున్నారేమో? 

ఆమె ఉద్దేశ్యాలు, కారణాలు ఏవైనప్పటికీ ప్రస్తుతం ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా మోడీ ప్రభుత్వంపై పోరాడుతున్నమాట వాస్తవం. కానీ రాహుల్ గాంధీ ఉండగా కాంగ్రెస్ పార్టీ మమత అక్క ప్రధానమంత్రి అవడానికి సహకరిస్తుందని ఆశించలేము. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తమ కంచుకోటని దెబ్బ తీసిన ఆమెకి వామపక్షాలు కూడా మద్దతు ఈయకపోవచ్చు. ప్రస్తుతం ఆమె నాయకత్వంలో మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్న సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ, జెడియూ, ఆర్.జె.డి. వంటి పార్టీల అధినేతలకి కూడా ప్రధానమంత్రి పీఠంపై ఆశలున్నాయి. కనుక వారు కూడా ఆమె ప్రధానమంత్రి అయ్యేందుకు సహకరిస్తారని భావించలేము. 

కానీ ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకొని దేశప్రజల అందరి దృష్టిని ఆకర్షించి జాతీయనాయకురాలుగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆమె తాపత్రయంతో ఫలించవచ్చేమో కానీ ఆమెకి ఎన్నటికీ ప్రధాని అయ్యే అవకాశం కనబడటం లేదు.


Related Post