ఇవిగో...కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు

November 11, 2016


img

కావేరీ జలాల పంపకాలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఎంత విద్వంసం జరిగిందో అందరూ చూశారు. పంజాబ్-హర్యానా రాష్ట్రాల మద్య కూడా సట్లెజ్-యమునా నదుల లింక్ కెనాల్ (ఎస్.వై.ఎల్.)పై చాలా కాలంగా అటువంటి జలవివాదాలే సాగుతున్నాయి. వాటిపై దాఖలైన కేసుని విచారించిన సుప్రీంకోర్టు హర్యానా రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. దానిని నిరసిస్తూ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ తన ఎంపి పదవికి నిన్న రాజీనామా చేశారు. ఈరోజు 42మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకి రాజీనామాలు చేస్తారు. తమ రాజీనామా పత్రాలని శాసనసభ స్పీకర్ అందుబాటులో లేకపోవడం శాసనసభ కార్యదర్శి శశి లఖన్ పాల్ మిశ్రాకి అందించారు. 

ఈ సమస్య పై సుప్రీంకోర్టు విచారణ జరిపినప్పుడు ఏదో ఒక రాష్ట్రానికి న్యాయం చేయడం సహజమే. దానిని రెండవ రాష్ట్రం వ్యతిరేకించడం కూడా సహజమే. కనుకనే పంజాబ్ కాంగ్రెస్ ఎంపి, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారనుకోవడానికి మాత్రం వీలు లేదు. ఎందుకంటే, ఈ సమస్య ఈరోజు కొత్తగా మొదలైనదేమీ కాదు. చాలా ఏళ్ళుగా ఉన్నదే. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు చేశారంటే వచ్చే ఏడాది పంజాబ్ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి అందుకు! ఆ ఎన్నికలని దృష్టిలో ఉంచుకొనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకొందని చెప్పవచ్చు. లేకుంటే ఇటువంటి ఆలోచనలు కూడా చేసేదే కాదు. పంజాబ్ ప్రయోజనాలని కాపాడేందుకు తాము రాజీనామాలు చేశామని ప్రచారం చేసుకొని ప్రజల సానుభూతి పొందాలనే ప్రయత్నమే ఇదని చెప్పవచ్చు. 

తమది జాతీయపార్టీ అని గొప్పగా చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు, ఈవిధంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యవహరించడం రాజకీయాలు చేయడం చాలా శోచనీయం. పంజాబ్ ఎన్నికల కోసమో లేదా పంజాబ్ ప్రయోజనాల కోసమో కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని అనుకొన్నా అది హర్యానా ప్రజలకి ఏమి సమాధానం చెపుతుంది? అయినా పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి దాని తరువాత ఆమాద్మీ పార్టీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని చెపుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి సంకుచిత, ప్రాంతీయవాద రాజకీయాలు చేయడం అవసరమా? మరొక 4-5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగవలసి ఉండగా ఇప్పుడు ఒకేసారి 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వలన ఉపఎన్నికలు నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది. దీనిని కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా సమర్ధించుకొంటుంది? కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా రాజకీయాలు చేస్తుండటం వలననే ప్రజలు దానిని దూరంగా ఉంచుతున్నారనే సంగతి గ్రహించకుండా తనకి బాగా అలవాటైన పద్దతిలోనే రాజకీయాలు చేస్తోంది. దాని వలన చివరికి అదే నష్టపోయే ప్రమాదం ఉంది.     



Related Post