అయితే యూపిలో భాజపా గెలుపు పక్కా!

November 11, 2016


img

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకి ఇంకా 3-4 నెలలు సమయం మాత్రమే మిగిలి ఉంది. సరిగ్గా ఇటువంటి కీలకమైన సమయంలో అధికార సమాజ్ వాదీ పార్టీలో కుమ్ములాటలు మొదలవడంతో ఆ పార్టీ నిలువునా చీలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దాని పరిపాలన పట్ల కూడా ప్రజలలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈసారి భాజపా లేదా ప్రతిపక్ష బహుజన సమాజ్ వాదీ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని సర్వేలు సూచిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవడం కోసం చర్చలు సాగించాయి.

సమాజ్ వాదీ పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపించింది కానీ అది ఒక షరతు పెట్టింది. యూపి సిఎం అఖిలేష్ యాదవ్ తో రాజీపడి మళ్ళీ ఆ పార్టీలో అందరూ కలిసికట్టుగా ఎన్నికలని ఎదుర్కొనేందుకు సిద్దపడితేనే దానితో పొత్తులు పెట్టుకొంటామని స్పష్టం చేసింది. ఆ పార్టీలో తండ్రి, కొడుకు, బాబాయ్, ఇతర కుటుంబ సభ్యుల మధ్య వీధిన పడేంత స్థాయిలో గొడవలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ షరతుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ అంగీకరించడం, దానిని అమలుచేయడం రెండూ కష్టమే. కనుక తాము కాంగ్రెస్ పార్టీతో సహా ఎ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకోవడం లేదని, ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని నిన్న లక్నోలో ప్రకటించారు. అలాగే అన్ని పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశ్యం కూడా లేదని ప్రకటించారు.

ఆయన నిజంగా అదే మాట మీద నిలబడి ఉన్నట్లయితే, ఆ ఎన్నికలలో భాజపా లేదా బహుజన సమాజ్ వాదీ పార్టీలలో ఏదో ఒక పార్టీ తప్పకుండా విజయం సాధించడం ఖాయం. ఎందుకంటే ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించమని సమాజ్ వాదీకి ఆ రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెడితే, ఐదేళ్ళలో రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి సాధించకపోగా, మతఘర్షణలు, గూండాలు, ఆ పార్టీ నేతలు, పోలీసుల అరాచకాలు, మహిళలపై సామూహిక అత్యాచారాలు, ఇప్పుడు ఈ కుటుంబ కలహాలతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించారు. కనుక ఒకవేళ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు పొత్తులు పెట్టుకొన్నా పెట్టుకోకపోయినా, ఒకవేళ అఖిలేష్ కొత్త పార్టీ పెట్టినా, పెట్టకుండా అందరూ కలిసే పోటీ చేసినా అందరూ ఓడిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. కనుక ఈ అవకాశం భాజపా, బహుజన సమాజ్ వాదీ పార్టీలలో ఏది సద్వినియోగ పరుచుకొని అధికారం దక్కించుకొంటాయో చూడాలి. 


Related Post