వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా: పవన్ కళ్యాణ్

November 10, 2016


img

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు అనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో తన అభిమానులకి ఉత్సాహం కలిగించే రెండు విషయాలు చెప్పారు. అనంతపురంలోనే జనసేన పార్టీ మొదటి కార్యాలయం ఏర్పాటు చేస్తానని,  వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ పదవులు, అధికారం కోసం కాదని ప్రజల సమస్యల తీర్చడానికే పోటీ చేయాలనుకొంటున్నట్లు చెప్పారు. తనకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించినా గెలిపించక పోయినా తాను మాత్రం ప్రజలకి ఎల్లప్పుడూ అండగా నిలబడతానని వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. 

తెదేపాకి ఇబ్బంది కలిగించే విషయం కూడా ఒకటి చెప్పారు. తెదేపా పాలనలో అవినీతి బాగా పెరిగిపోయిందని వార్తలు వినబడుతున్నాయని, దానిని అదుపు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయాలని సలహా ఇచ్చారు.

ఈ సభ యొక్క ముఖ్యోదేశ్యం ప్రత్యేక హోదా సాధించడం. కానీ దానిని సాధించదానికి ఈసారి కూడా ఎటువంటి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికని పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు. ఆయన ప్రసంగం అంతా ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కేంద్రప్రభుత్వాన్ని విమర్శించడంతోనే సరిపెట్టారు. కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలని మోసం చేసిందని, ఇంకా ప్రత్యేక ప్యాకేజి పేరుతో కూడా మోసం చేస్తోందని అన్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని పవన్ కళ్యాణ్ కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేస్తున్నప్పటికీ తెదేపా ప్రభుత్వం దానికి ‘జీ హుజూర్’ అంటూ తందాన తాన పాడటం సరికాదన్నారు. 

మిగిలిన అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్లుగానే కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నిధులు ఇస్తోంది తప్ప అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని, కానీ కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఇద్దరూ రాష్ట్రానికి లక్షల కోట్లు ఇచ్చేస్తున్నట్లు అంకెల గారాడీలతో ప్రజలని మోసం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అటువంటి వారికి వచ్చే ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెపుతారని అన్నారు. 

అనంతపురం కరువు పరిస్థితుల గురించి యావత్ దేశప్రజలకి తెలియజేసేందుకు జిల్లా ప్రజలని, రైతన్నలని ప్రత్యక రైళ్ళలో డిల్లీకి తీసుకువెళ్ళాలనుకొంటున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రత్యేక హోదా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు తాను అపాయింట్ మెంట్ కోరానని కానీ ఇంకా దొరకలేదని చెప్పారు. 

ఈ సభలో పవన్ కళ్యాణ్ కొత్తగా చెప్పినవి రెండే పాయింట్లు కనిపిస్తున్నాయి. అనంతపురంలో జనసేన పార్టీ మొదటి కార్యాలయం ఏర్పాటు చేయడం, తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం. మిగిలిన మాటలన్నీ పాతవే. ఇటువంటి సభల వలన పవన్ కళ్యాణ్ ఏమి ఆశిస్తున్నారో ఏమి సాధించాలనుకొంటున్నారో ఆయనకే స్పష్టత లేనట్లు కనిపిస్తోంది. 



Related Post