మోడీ అనాలోచితంగానే పెద్ద నోట్లు ప్రవేశపెట్టారా?

November 10, 2016


img

దేశంలో పాత నోట్లని రద్దు చేస్తున్నప్పుడు వాటిని ఎందుకు రద్దు చేస్తున్నారో ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. నల్లధనం అరికట్టడానికే పెద్ద నోట్లని రద్దు చేసినప్పుడు మళ్ళీ వాటి స్థానంలో కొత్తగా రూ.500, ఇంకా పెద్ద నోటు రూ. 2,000ని ఎందుకు ప్రవేశపెడుతున్నారు?అనే సందేహం సామాన్య ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. 

పెద్ద నోట్లని రద్దు చేయాలని చిరకాలంగా కోరుతున్న ఏపి సిఎం చంద్రబాబు కూడా ఇదే సందేహం వ్యక్తం చేశారు. రూ.500, 2,000 నోట్లు ముఖ్యంగా 2,000 నోట్లు ప్రవేశపెట్టడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటిని పరిమిత సంఖ్యలోనే ప్రవేశపెట్టి, వాటిపై నిఘా పెట్టాలని కోరుతున్నారు. వాటిని కొంత కాలం తరువాత రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ కొత్త నోట్లకి బదులుగా రూ.200 నోట్లు ప్రవేశపెడితే బాగుంటుందని సూచిస్తున్నారు. సూచించడమే కాదు..భవిష్యత్ లో రూ.200 నోట్లు వస్తాయని జోస్యం కూడా చెప్పారు.

 కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా ఇదే అనుమానం కలిగింది. నల్లధనం అరికట్టడానికే పెద్ద నోట్లని రద్దు చేసినప్పుడు మళ్ళీ వాటి స్థానంలో కొత్తవి, ఇంకా పెద్ద నోట్లని ఎందుకు ప్రవేశపెట్టారని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వలన విదేశాలలో స్థిరాస్తులు, బంగారం రూపంలో దాచుకొన్నవారికి ఎటువంటి నష్టమూ ఉండబోదు కానీ సామాన్య ప్రజలు, గృహిణులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారు చాలా ఇబ్బందులకి గురి చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. 

మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వలన దేశంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్న మాట వాస్తవమే. కానీ అది తాత్కాలికమే. ఈ నిర్ణయం వలన నల్లధనం పోగేసుకొన్నవారే తీవ్రంగా నష్టపోతారని అర్ధం అవుతూనే ఉంది. నల్లధనం అరికట్టి మళ్ళీ ఇంకా పెద్దనోట్లు జారీ చేయడం వలన మళ్ళీ బారీగా నల్లధనం పోగుపడదా? అంటే తప్పకుండా పోగుపడుతుందని చెప్పవచ్చు. మరి ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీకి తెలియకనే ఇంకా పెద్ద నోట్లు జారీ చేశారా? అని ఆలోచిస్తేనే ఆయన చాలా దూరదృష్టితోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అర్ధం అవుతుంది. 

ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి నల్లధనం అరికట్టడానికి తీసుకొంటున్న చర్యలని అందరూ చూశారు. కానీ దాని వలన ఆశించినంతగా నల్లధనం బయటకి రాలేదనే మాట కూడా అంగీకరించక తప్పదు. నల్లదనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ఏడాదిపాటు గడువు ఇస్తే కేవలం రూ.66,000 కోట్లు మాత్రమే జరిమానాలు, పన్ను రూపేణా వసూలు అయ్యింది.

విదేశీ బ్యాంకులలో కనీసం రూ.358,679,863,300,000 అంటే సుమారు 1.3 ట్రిలియన్ డాలర్లు వరకు ఉంటుందని ఒక అంచనా. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, వివిధ రంగాలకి చెందిన ప్రముఖులే దానిని పోగేశారనేది బహిరంగ రహస్యమే. నేటికీ అది అక్కడే భద్రంగా ఉంది. దానిని బయటపెట్టడానికి మోడీ ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పటికీ అనేక కారణాల వలన చాలా మంది దానిని వినియోగించుకోలేదు. అందుకే అంత తక్కువ వసూలు అయ్యిందని అర్ధం అవుతోంది కనుక మోడీ ప్రభుత్వం తీసుకొన్న ఈ తాజా నిర్ణయంతో వారి డబ్బు అంతా చిత్తు కాగితాలతో సమానం అవుతుంది. 

అంతవరకు బాగానే ఉంది మళ్ళీ నల్లధనం పోగుచేసేందుకు మోడీ ఎందుకు అవకాశం కల్పిస్తున్నారు? అనే సందేహం కలగడం సహజం. ఇంతవరకు మోడీ ఏ పని చేసినా చాలా దూరదృష్టితో ఆలోచించి, ముందుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొన్నాకనే దానిని అమలుచేస్తుండటం గమనించినట్లయితే, ఇది కూడా మరొక ఎత్తుగానే కనిపిస్తుంది. మొన్న తీసుకొన్న నిర్ణయంతోనే చాలా వరకు నల్లధనం తుడిచిపెట్టుకుపోయుంటుంది. మళ్ళీ పోగేస్తే సరిగ్గా వచ్చే ఎన్నికలకి ముందు మళ్ళీ ఈ రెండు కొత్త నోట్లని రద్దు చేసి నల్లధనం పెట్టుకోవాలంటేనే అందరూ భయపడే పరిస్థితి కల్పించాలని భావిస్తున్నారేమో? కనుక మళ్ళీ కొత్తవి, పెద్ద నోట్లని అనాలోచితంగా ప్రవేశపెట్టినట్లు అనుకోవడానికి లేదు. చంద్రబాబు మాటలు కూడా అదే సూచిస్తునట్లుగా ఉన్నాయి.


Related Post