కోదండరామ్ రియాక్షన్ అదిరింది

November 10, 2016


img

తెలంగాణా జేఎసి చైర్మన్ ప్రొఫెసర్  కోదండరామ్ కాంగ్రెస్ ఏజంటు అని, ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రహస్య అవగాహన చేసుకొని, ఆ పార్టీ తరపున తెరాస ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని తెరాస ఎంపి బాల్క సుమన్ చేసిన ఆరోపణలకి ఊహించినట్లుగానే ఆయన అంతకంటే చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

“ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? ప్రశ్నిస్తున్న వారికి సమాధానాలు చెప్పకుండా వారిపై ఎదురు దాడులు ఎందుకు చేస్తున్నారు?” అని కోదండరామ్ ప్రశ్నించారు. అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. తాను ఎవరితోనూ రహస్యంగా మంతనాలు చేయలేదని, ఆ అవసరం తనకి లేదని అన్నారు. తెరాస ఎంపి చెపుతున్న ఆ తేదీలలో తను కాశీలో, హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో ఉన్నానని డిల్లీలో లేనని అన్నారు. తాను క్షేత్రస్థాయిలో రాష్ట్రమంతటా పర్యటించి, ప్రజలు, రైతుల సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియజేసి వాటిని పరిష్కరించమని కోరుతుంటే ఈవిధంగా తనపై ఎదురుదాడి చేయడం చాలా శోచనీయమని అన్నారు. తనకి రాజకీయాలపై ఆసక్తి లేదని ప్రజల కోసమే వారి తరపున మాట్లాడుతున్నానని అన్నారు. 

“తెలంగాణా ఏర్పడితే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అనుకొన్నాను కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని, ప్రజలు ఆశిస్తున్నది ఇది కాదు. ప్రభుత్వం ఇదే తీరుగా వ్యవహరిస్తుంటే నేను పోరాటాలు కొనసాగించక తప్పని పరిస్థితులు ఏర్పడుతాయి,” అని ప్రొఫెసర్  కోదండరామ్ అన్నారు. 

పోరాటాలు చేస్తానని హెచ్చరించడమే కాకుండా కొన్ని సమస్యలపై సదస్సులు నిర్వహించడానికి ఆయన తేదీలు కూడా ప్రకటించారు. నవంబర్ 11న మంధనిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశం అవుతానని ప్రకటించారు. నవంబర్ 13న హైదరాబాద్ లో వైద్య రంగ సమస్యలపై సదస్సుని, 20న హైదరాబాద్ లోనే సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలు, ఓపెన్ కాస్ట్ గనులపై సదస్సులు నిర్వహిస్తానని కోదండరామ్ ప్రకటించారు. 

ప్రొఫెసర్  కోదండరామ్ చాలా కాలంగా ప్రజా సమస్యలని తెరాస సర్కార్ దృష్టికి తీసుకువస్తూనే ఉన్నారు కానీ వాటిని అది ఏనాడూ పట్టించుకోలేదు. ఎందుకంటే ‘మాకు అన్నీ తెలుసు..మేము చేస్తున్నదే సరైనది...కనుక మమ్మల్ని ఎవరూ తప్పు పట్టకూడదు..విమర్శించకూడదు..విమర్శిస్తే సహించము,’ అనే విధంగా తెరాస సర్కార్ వ్యవహరిస్తోంది. ఈ వైఖరి వలన అది ప్రజలు, రైతుల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్ని మంచి పనులు చేస్తున్నా కూడా విమర్శల పాలవుతోంది. ఆ వైఖరిని వదులుకోవడానికి తెరాస సర్కార్ ఇష్టపడకపోవడం వలన చివరికి ప్రొఫెసర్  కోదండరామ్ వంటి వారిని కూడా శత్రువులుగా భావిస్తూ వారితో కూడా యుద్దాలు చేస్తోంది. కానీ దాని వలన తమ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని, కోదండరామ్ వంటివారు ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తామే ఇబ్బందిపడవలసి వస్తుందని గ్రహించడం లేదు. కోదండరామ్ చెపుతున్నవి అయన వ్యక్తిగత సమస్యలు కావు. రైతులు, విద్యార్ధులు, కార్మికులు, ప్రాజెక్టుల గురించే ఆయన మాట్లాడుతున్నారు. మరి అటువంటప్పుడు ఆయన చెపుతున్నవి వినడానికి తెరాస సర్కార్ కి అభ్యంతరం దేనికి? అది కూడా వాటి పరిష్కారానికే కృషి చేస్తోంది కదా? ఆలోచిస్తే మంచిది.


Related Post