అమెరికాలో ఇదేమి విడ్డూరం?

November 09, 2016


img

భారత్ రాజకీయాలలో లేదా ఎన్నికలలో ఎప్పుడు ఏమి జరిగినా ఎవరూ ఆశ్చర్యపోరు. ఎందుకంటే, “ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా” అంటే భారత్ లో ఏమైనా జరిగే అవకాశం ఉందని అందరికీ తెలుసు కనుక. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జరిగిన తీరు, వాటిలో డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ ఒకరిపై మరొకరు పరస్పరం చేసుకొన్న ఆరోపణలు, ఈరోజు వెలువడిన ఫలితాల తీరు అన్నీ కలిపి చూస్తే అమెరికా రాజకీయాలు, అక్కడి నేతలు కూడా మనవాళ్ళకి ఏమాత్రం తీసిపోరనిపిస్తుంది. 

అమెరికా అగ్రరాజ్యం...అంటే భారత్ కంటే ఒకడుగు ముందు ఉందని అర్ధం అనుకొంటే అది నిరూపించడానికి నేడు మరో బలమైన ఉదాహరణ కూడా కనబడుతోంది. డోనాల్డ్ ట్రంప్ ప్రజాస్వామ్యబద్దంగా అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. కానీ ఆయన గెలుపుని జీర్ణించుకోలేకపోతున్న ప్రజలు కొందరు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 

నార్త్ కాలిఫోర్నియా నుంచి సీటెల్ వరకు డెమొక్రాట్ పార్టీ మద్దతుదారులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా కాలిఫోర్నియా కాలేజీ, లిబరల్ యూనివర్సిటీ క్యాంపస్ లలో కూడా ట్రంప్ కి వ్యతిరేకంగా చాలా మంది యువతీయువకులు నినాదాలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. 

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసభవనం వైట్ హౌస్ ముందు ట్రంప్ మద్దతుదారులపై హిల్లరీ మద్దతుదారులు దాడులు చేశారు. ఒక్లాండ్ డౌన్ టౌన్, సాన్ జోస్, బర్కెలీ, తదితర ప్రాంతాలలో కూడా విద్యార్ధులు రోడ్లెక్కి ట్రంప్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్వంసం సృష్టించారు. కొన్నిచోట్ల ఆయన దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేసి తమ నిరసనలు తెలియజేశారు.

ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలలో ప్రజలందరూ పాల్గొని తమకి నచ్చిన అభ్యర్దులకే ఓట్లు వేసుకొన్న తరువాత ఇప్పుడు ఆ ఎన్నికలలో గెలిచిన డోనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా ఈవిదంగా నిరసనలు తెలియజేయడం చాల విడ్డూరంగా ఉంది. డోనాల్డ్ ట్రంప్ ఎటువంటివాడైనప్పటికీ, ఆయన ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలలో గెలిచారు. కనుక ఆయన ఎన్నికని ఎవరూ తప్పుపట్టడం సరికాదు. ఎవరైనా తప్పు పడితే తమ నిర్ణయాన్ని తామే తప్పని చెప్పుకొన్నట్లే అవుతుంది. ప్రపంచదేశాలన్నీ గౌరవించే తమ దేశాధ్యక్షుడిని తామే అవమానించుకొంటున్నారు. అమెరికాలో మొదలైన ఈ నిరసనలని చూసి ప్రపంచ దేశాలు కూడా నవ్వుకొనే పరిస్థితి ఏర్పడింది. ఏదైనా సాధ్యం అనుకొనే భారత్ లో కూడా ఏనాడు ఇటువంటి విడ్డూరం జరుగలేదు కానీ అగ్రరాజ్యమని చెప్పుకొంటున్న అమెరికాలో ప్రజలే స్వయంగా ఎన్నుకొన్న అధ్యక్షుడిని వారే వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేయడం చాలా విచిత్రంగా ఉంది. 



Related Post