ట్రంప్ విజయం...అమెరికా ఫస్ట్ నినాదం రిపీట్

November 09, 2016


img

డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. జనవరిలో 45వ అమెరికా అధ్యక్షుడుగా పదవి భాద్యతలు చేపట్టబోతున్నారు. ఆయన మొత్తం 289 ఎలక్టోరల్ కాలేజి ఓట్లు సాధించారు. అంటే మ్యాజిక్ ఫిగర్ :270 కంటే మరో 19 సీట్లు ఎక్కువే సాదించారన్న మాట. ఈ ఎన్నికలలో తప్పకుండా విజయం సాదిస్తారనుకొన్న హిల్లరీ క్లింటన్ కేవలం 218 ఓట్లు మాత్రమే సాధించారు. ఆమె తన ఓటమిని అంగీకరించి, ట్రంప్ కి ఫోన్ ద్వారా అభినందనలు కూడా తెలిపారు. 

ఎన్నికలలో విజయం సాధించిన తరువాత డోనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ లో దేశ ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగించారు. తన తల్లి తండ్రులకి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, ఎన్నికలలో తన విజయం కోసం ఎంతో కృషి చేసిన తన అనుచరులకి, అభిమానులకి ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి అమెరికాని ఆర్ధికంగా, రాజకీయంగా, అన్ని రంగాలలో కూడా శక్తివంతంగా అభివృద్ధి చేసుకొందామని ట్రంప్ అన్నారు. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో ముందుకు సాగుదామని అన్నారు. అమెరికాతో కలిసి వచ్చే దేశాలన్నిటితో సంబంధాలు మరింత బలపరుచుకొంటానని చెప్పారు. దేశప్రజలు అందరూ కలిసిమెలిసి మెలగాలని కోరుకొంటున్నానని, కానీ ‘అమెరికా ఫస్ట్’ అనే తన ప్రాధాన్యతలో ఎటువంటి మార్పు ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు.  

ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ట్రంప్ ఈరోజు చేసిన ప్రసంగం చాలా హుందాగా సాగింది. బహుశః తన పట్ల దేశవిదేశాలలో నెలకొన్న వ్యతిరేకతని, తన వ్యవహార శైలిపై వస్తున్న విమర్శలని దృష్టిలో పెట్టుకొని ఆయన హుందాతనం కనబరిచినట్లున్నారు. ఏమైనప్పటికీ ఆయన వంటి చాలా దూకుడు ఉన్న వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతున్నందున, ఆ ప్రభావం అమెరికాపై, ప్రపంచ దేశాలపై తప్పకుండా ఉంటుంది. కనుక భారత్ తో సహా అన్ని దేశాలు వేచి చూసే ధోరణి అవలంభించవచ్చు. 


Related Post