ప్రొఫెసర్ కోదండరామ్ పై మళ్ళీ తెరాస విమర్శలు

November 08, 2016


img

తెరాస ఎంపి బాల్క సుమన్ తెలంగాణా రాజకీయ జేయేసి చైర్మన్ ప్రొఫెసర్  కోదండరామ్ పై మళ్ళీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మేధావి ముసుగులో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏజంటుగా వ్యవహరిస్తున్నారంటూ ఇదివరకు తీవ్ర విమర్శలు చేసిన బాల్క సుమన్ ఈరోజు ఇంకా తీవ్రమైన విమర్శలు చేశారు. 

ప్రొఫెసర్  కోదండరామ్ జేయేసి ముసుగులో తెరాస సర్కార్ పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేరుగా తెరాస సర్కార్ ని డ్డీ కొనలేక ప్రొఫెసర్  కోదండరామ్ ని తమపై ప్రయోగిస్తోందని ఆరోపించారు.  ఆయన సోనియాగాంధీతో రహస్య ఒప్పందం చేసుకొని వచ్చి మేధావి ముసుగులో తెరాస సర్కార్ పై బురద జల్లుతూ అప్రదిష్టపాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. ఆయనకి మొదటి నుంచి కాంగ్రెస్ వాసనలు ఉన్నాయని, అందుకే అయన ఇద్దరు వ్యక్తులకి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కూడా ఇప్పించారని ఆరోపించారు. ప్రొఫెసర్  కోదండరామ్ తెలంగాణా ద్రోహి..ఆయన మాటలని నమ్మవద్దని ప్రజలని కోరారు. 

మంచి ప్రజాధారణతో ఎన్నికైన ప్రభుత్వాలు కూడా తప్పులు చేయడం సహజమే. వాటిని ప్రొఫెసర్  కోదండరామ్ వంటి మేధావులు ఎత్తి చూపిస్తున్నప్పుడు సరిదిద్దుకొని ముందుకు సాగితే తెరాస సర్కార్ కి ఇంకా ప్రజాధారణ పెరుగుతుంది. కానీ ఆయన తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే కోపంతో ఆయనపై ఈవిధంగా విమర్శలు చేస్తే తెరాస సర్కార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. 

ప్రొఫెసర్  కోదండరామ్ కూడా తరచూ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం, విమర్శలు చేయడం కంటే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని వచ్చే ఎన్నికలలో పోటీ చేసి అధికారం చేపట్టి తను కోరుకొంటున్న విధంగా పరిపాలనా, అభివృద్ధి చేసి చూపిస్తే మంచిది. అలాకాక తెరాస సర్కార్ పై నిత్యం అసంతృప్తి వ్యక్తం చేయడం వలన ఈవిధంగా విమర్శలు ఎదుర్కోవలసి రావడమే తప్ప మరే ప్రయోజనమూ ఉండదు. ఒకవేళ ఆయన స్వయంగా పార్టీని స్థాపించుకొనే శక్తి, ఆసక్తి లేనట్లయితే తనకి నచ్చిన రాజకీయ పార్టీలో చేరి తెరాస సర్కార్ తో పోరాడితే ఆయనకి ఆ పార్టీ అండదండలు కూడా లభిస్తాయి. ఇవేవీ సాధ్యం కావనుకొంటే తెలంగాణా రాష్ట్ర బాగోగులు చూసే బాధ్యతని తెరాస సర్కార్ కి వదిలిపెట్టి సమాజసేవా కార్యక్రమాలు చేసుకోవడం ఉత్తమం. 


Related Post