ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరిపోయారా?

November 08, 2016


img

2014ఎన్నికలలో ప్రధాని అభ్యర్ధిగా పోటీ చేసిన నరేంద్ర మోడీకి ఎన్నికల వ్యూహరచన చేసి మొదటిసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు ప్రశాంత్ కిషోర్. ఆ తరువాత ఆయనే బిహార్ లో లాలూ, నితీష్ కుమార్ ల కోసం పనిచేసి భాజపా ఓటమికి కారణం అయ్యారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. వచ్చే ఏడాది జరుగబోయే యూపి, పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత భుజాన్న వేసుకొన్నారు. నిజానికి ఆయన తెర వెనుక ఉండి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి ఉన్న అవకాశాలని గుర్తించి, అందుకు అనుగుణంగా అవసరమైన సలహాలు, సూచనలు మాత్రమే చేయవలసి ఉంది. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో నేరుగా చర్చలు జరుపుతుండటం విశేషం. నిజానికి ఆ బాధ్యత ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు లేదా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చేయాలి. కానీ ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ నాయకుడిలాగ ఇతర పార్టీల నేతలతో కాంగ్రెస్ పార్టీ తరపున చర్చలు జరుపుతుండటం చాలా విచిత్రంగానే ఉంది. తమకి బదులు ఆయన ఇతర పార్టీల నేతలతో చర్చలు చేస్తుండటం చూసి కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆశ్చర్యపోతున్నారు. 

ఆయన తీరు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారా అనే అనుమానం కలుగుతోంది. ఆయన ఇప్పటికి రెండుసార్లు ములాయం సింగ్ తో సమావేశమయ్యి ఎన్నికల పొత్తుల గురించి చర్చించారు. అంటే కాంగ్రెస్ పార్టీ, యూపిలో అధికార సమాజ్ వాదీ పార్టీతో ఎన్నికలపొత్తులు పెట్టుకోవడానికి ఆసక్తిగా ఉందని స్పష్టం అవుతోంది. 

ఒకవేళ ఆ రెండుపార్టీలు పొత్తులు పెట్టుకొన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి షీలా దీక్షిత్ ని పక్కనపెట్టేసినట్లే భావించవచ్చు. నిజానికి ఆమెకి ఆ అవకాశం కల్పించింది కూడా ప్రశాంత్ కిషోరే. బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే, రాష్ట్రంలో అగ్రవర్ణం ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ ఖాతాలో పడిపోతాయని సలహా ఇవ్వడంతో కాటికి కాళ్ళు జాపుకొని కూర్చొన్న షీలా దీక్షిత్ ని పట్టుకొని వచ్చి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోరే సమాజ్ వాదీతో పొత్తులు పెట్టుకోమని చెపుతున్నాడు. చెప్పడమే కాదు దానికోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు కూడా. ఒకవేళ వాటి మద్య ఎన్నికల పొత్తులు కుదిరినట్లయితే, సహజంగానే ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కే మళ్ళీ ఆ పదవి ఈయవలసి ఉంటుంది. కనుక ప్రశాంత్ కిషోర్ వలననే షీలా దీక్షిత్ మూట ముల్లె సర్దుకొని డిల్లీ వెళ్ళిపోకతప్పని పరిస్థితి కనిపిస్తోంది. 

అవినీతికి, అసమర్ధతకి మారుపేరుగా నిలిచిన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు పొత్తులు పెట్టుకొన్నప్పటికీ ప్రజలు వాటికి ఓట్లు వేసి గెలిపిస్తారా? అంటే అనుమానమే. ఈసారి ఎన్నికలలో భాజపాకి లేదా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీలకే విజయావకాశాలున్నాయని సర్వేలు చెపుతున్నాయి. భాజపాతో ఎట్టి పరిస్థితులలో కూడా ఎన్నికల పొత్తులు పెట్టుకోనని మాయావతి స్పష్టంగా చెపుతున్నారు. కనుక ఆ రెండు పార్టీలు సమాజ్ వాదీ, కాంగ్రెస్ కూటమికి గట్టి పోటీ ఈయడం ఖాయం.   



Related Post