పంట రుణాల మాఫీలో మరో అడుగు

November 08, 2016


img

తెరాస సర్కార్ పంటరుణాల మాఫీకి దశలవారిగా నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం మూడో దశలో రెండవ విడతగా రూ.2,019.19 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో కలిపి ఇంతవరకు మొత్తం రూ.12,000 కోట్లు మాఫీ చేసినట్లు అవుతుంది. ఏడాదికి రూ. 4250 కోట్లు చొప్పున నాలుగేళ్ళలో మొత్తం రూ.17,000 కోట్లు పంట రుణాలని  మాఫీ చేయాలని తెరాస సర్కార్ నిర్ణయించింది. మళ్ళీ వచ్చే ఏడాది మిగిలిన బాకీలని మొత్తం ఒకేసారి జూలై నేలలోగానే విడుదల చేయాలని తెరాస సర్కార్ భావిస్తోంది.

తెరాస సర్కార్ చాలా బారీ మొత్తమే మాఫీ చేస్తున్నప్పటికీ అది ఒకేసారి చేయకపోవడం వలన రైతులు తమ అప్పుల ఊబిలో నుంచి బయటపడలేకపోతున్నారు. ఈ పంటరుణాల మాఫీకి అర్హులుగా ప్రభుత్వం గుర్తించిన వారందరూ ఈ కారణంగా మళ్ళీ కొత్తగా బ్యాంకుల నుండి రుణాలు పొందలేక, బయట అధిక వడ్డీలకి అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేస్తూ ఇంకా నష్టపోతున్నారు. ఈ కారణంగానే రాష్ట్రంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు కూడా.

రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు ఇటువంటి హామీలు ఇవ్వడం వలన అవి వారికి మేలు చేయకపోగా యమపాశంలాగ మారుతున్నాయి. పంటరుణాల మాఫీ చేయడం కంటే, రైతులకి సకాలంలో తక్కువ వడ్డీలకి బ్యాంకుల నుంచి రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇన్-పుట్ సబ్సీడీ, వారు పండించిన ఉత్పత్తులని నిలువ చేసుకోవడానికి స్టోరేజిలు, వారి ఉత్పత్తులకి సరైన ధర, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే వారికి ఎక్కువ మేలు కలుగుతుంది.


Related Post