కోదండరామ్ పై కాంగ్రెస్ ముద్ర దేనికి?

November 05, 2016


img

తెలంగాణా జేఎసి చైర్మన్ ప్రొఫెసర్  కోదండరామ్ తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తరచు ఎన్ని విమర్శలు చేస్తున్నా కూడా ఆయనకున్న ప్రజాధారణ, గౌరవం కారణంగా తెరాస తిరిగి గట్టిగా జవాబీయలేకపోతోంది. కానీ అప్పుడప్పుడు విమర్శలు చేస్తూనే ఉంది. తెరాస ఎంపి బాల్క సుమన్ ఆయనపై చాలా ఘాటుగా విమర్శలు చేశారు. 

ఆయన మేధావి ముసుగులో ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు. అసలు జేఎసియే లేనప్పుడు ఆయన ఎవరికి నాయకత్వం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఏజంటులాగ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణాలో వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా బ్రతికించాడానికి ఆయన దాని తరపున పని చేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. అందుకే మేధావి ముసుగులో తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. జిల్లాల పునర్విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండేళ్ళు చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజాభీష్టానికి అనుగుణంగా కొత్త జిల్లాలని, మండలాలని ఏర్పాటు చేస్తే, అది శాస్త్రీయంగా జరుగలేదని ప్రొఫెసర్  కోదండరామ్ చెప్పడంపై బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రొఫెసర్  కోదండరామ్ గురించి బాల్క సుమన్ వ్యక్తం చేసిన అభిప్రాయం, ఆయనపై చేసిన వ్యాఖ్యలు తెరాస అభిప్రాయాన్ని తెలియజేస్తున్నట్లుగానే భావించవచ్చు. ఇంతకాలం ప్రొఫెసర్  కోదండరామ్ తెరాస ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా ఓపికగా సహించింది కానీ ఇకపై సహించబోదని స్పష్టమైన సంకేతం ఇచ్చింది. బహుశః అందుకే బాల్క సుమన్ ఆయనపై కాంగ్రెస్ ముద్ర వేసినట్లు భావించవచ్చు. ఇకపై తెరాస నేతలు ప్రొఫెసర్ కోదండరామ్ ని కాంగ్రెస్ పార్టీకి జోడిస్తూ విమర్శలు చేసే అవకాశం ఉంది. తద్వారా ప్రజలు కూడా తెరాసని తప్పు పట్టలేరు. ఇదే తెరాస వ్యూహం అయితే అది చాలా గొప్ప వ్యూహమే అని చెప్పక తప్పదు.



Related Post