కెసిఆర్ కోర్టులోనే బంతి ఉంది

November 05, 2016


img

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు నాయుడు ఆయనని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంగా సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో ఉన్న భవనాలని తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించమని చంద్రబాబుని గవర్నర్ కోరగా, ఆయన రెండు రాష్ట్రాల మద్యన అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్యలని ఏకరువు పెట్టి వాటి పరిష్కారానికి కెసిఆర్ సిద్దం అయితే తాను కూడా పట్టువిడుపులు ప్రదర్శించడానికి సిద్దం అని తేల్చి చెప్పారు. 

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడూ తనకి అవసరమైన అంశాలపైనే మాట్లాడుతుంటారు కానీ ఏపి సర్కార్ చేస్తున్న విజ్ఞప్తులని అసలు పట్టించుకోరని చంద్రబాబు పిర్యాదు చేస్తుంటారు. షెడ్యూల్: 10లో ఆస్తుల విభజన విషయంలో కూడా కెసిఆర్ ఆవిధంగానే వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కనుక ఆ సమస్యలని పరిష్కరిస్తే కానీ సచివాలయంలోని భవనాలని అప్పగించబోమని తేల్చి చెప్పినట్లే భావించవచ్చు. కనుక ఇప్పుడు బంతి కెసిఆర్ కోర్టులోనే ఉందని చెప్పవచ్చు. 

కెసిఆర్ వీలైనంత త్వరగా కొత్త సచివాలయం నిర్మాణపనులు మొదలుపెట్టాలనుకొంటున్నారు కనుక సచివాలయంలో ఏపి సర్కార్ అధీనంలో ఉన్న భవనాలు స్వాధీనపరుచుకోవాలనుకొంటే తప్పనిసరిగా అది చెపుతున్న సమస్యలపై చర్చలకి సిద్దం కాకతప్పదు. కానీ కెసిఆర్ అందుకు సిద్దపడతారా? లేకపోతే సచివాలయాన్ని స్వాధీనం చేసుకొనేందుకు వేరే ఉపాయం ఏదైనా ఆలోచిస్తారా?  అనేది త్వరలోనే తెలుస్తుంది. సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోకుండా, ఏళ్ళ తరబడి నాన్చినట్లయితే దాని విశాపరినామాలు ఏవిధంగా ఉంటాయో తెలంగాణా ఉద్యమాల సమయంలో అందరూ చూశారు. అపారమైన రాజకీయ అనుభవజ్ఞులైన చంద్రబాబు, కెసిఆర్ తమ పంతాలని, రాజకీయ విభేధాలని పక్కన పెట్టి సమస్యలని పరిష్కరించుకొంటే రెండు రాష్ట్రాలకి మంచిది.


Related Post