రాహుల్, కేజ్రీ శవరాజకీయాలు

November 04, 2016


img

కేంద్రంలో యూపియే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్టీని, దేశ రాజకీయాలని, ప్రభుత్వ వ్యవస్తలని సమూలంగా ప్రక్షాళన చేయడం చాలా అవసరమని లెక్చర్లు ఇచ్చేవారు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా రాజకీయాల ప్రక్షాళన చేస్తానని చెప్పుకొనే అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు దేశంలో సగటు రాజకీయ నాయకుల కంటే దిగజారిపోయి శవరాజకీయాలు చేస్తున్నారు. 

మాజీ ఆర్మీ ఉద్యోగులకి “వన్ ర్యాంక్-వన్ పెన్షన్’ అమలుచేయనందుకు నిరసనగా హర్యానాలోని భివానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి రామకిషన్ గ్రేవాల్ (69) మొన్న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద విషం త్రాగి ఆత్మహత్య చేసుకొంటే, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వారిని నియంత్రించడానికి పోలీసులు కస్టడీలో తీసుకోవలసి వచ్చింది. 

ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలాలనుకొన్న రాహుల్ గాంధీని, డిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ని డిల్లీ పోలీసులే అరెస్ట్ చేయవలసిరావడం చాలా విచిత్రం. అయితే అందుకు వారిరువురూ ఏమాత్రం సిగ్గుపడలేదు. ఎందుకంటే, వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోతున్న యూపి, పంజాబ్ రాష్ట్రాల నుంచే  ఆర్మీలో అత్యధిక సంఖ్యలో జవాన్లు, సైనికాధికారులు ఉన్నందున, వారందరిని ప్రసన్నం చేసుకొని వారి ఓట్లు పోగేసుకోవాలంటే ఆ మాత్రం డ్రామాలు ఆడక తప్పదని వారు భావిస్తున్నట్లున్నారు. 

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా, ఆత్మహత్య చేసుకొన్న ఆ ఆర్మీ జవాను కుటుంబానికి అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించేశారు. ఆర్మీ జవాన్ల సేవలకి, వారి త్యాగాలకి ఎవరూ మూల్యం కట్టలేరు. అరవింద్ కేజ్రీవాల్ నిజంగానే అదే ఉద్దేశ్యంతో ఇచ్చి ఉండి ఉంటే ఎవరూ తప్పు పట్టి ఉండేవారు కాదు. కానీ పంజాబ్ ఎన్నికలలో తన పార్టీకి లబ్ది కలిగించాలనే ఉద్దేశ్యంతోనే అతని కుటుంబానికి ఏకంగా కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వడానికి సిద్దపడటమే తప్పు. 

దక్షిణాదిన ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాలలో అనేకమంది ఆర్మీ జవాన్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వారిలో ఎవరినీ రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు పట్టించుకోవడం లేదు? రామకిషన్ గ్రేవాల్ ని మాత్రమే ఎందుకు పట్టించుకొంటున్నారు అంటే దక్షిణాదిన ఇప్పుడు ఎన్నికలు లేవు. కానీ రామకిషన్ గ్రేవాల్ ఎన్నికలు జరుగబోతున్న పంజాబ్ రాష్ట్రానికి పక్కనే ఉన్న హర్యానా రాష్ట్రానికి చెందినవాడు కావడం వలననే అని చెప్పవచ్చు. 

పంజాబ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలకే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు తేల్చి చెపుతున్నాయి కనుక వాటిని ఇంకా మెరుగు పరుచుకోవాలంటే ఇటువంటి డ్రామాలు ఇంకా ఎన్నైనా ఆడక తప్పదు. అందుకే రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ నిన్న అతని అంత్యక్రియలకి కూడా హాజరయ్యారు. ఒకవేళ పంజాబ్, యూపి శాసనసభ ఎన్నికలు లేనట్లయితే వాళ్ళిద్దరూ హాజరయ్యేవారా? అంటే కాదనే అర్ధం అవుతుంది. రాజకీయాలని ప్రక్షాళన చేస్తామని గొప్పలు చెప్పుకొన్న వాళ్ళిద్దరూ చివరికి ఇంతకి దిగజారిపోవడం చాలా విస్మయం కలిగిస్తోంది. 


Related Post