ఉద్యమకారులు ఇప్పుడు గుర్తు వచ్చారా?

November 03, 2016


img

వరంగల్ పట్టణంలో నిన్న జరిగిన బహిరంగ సభలో ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, “మొదటి నుంచి తెరాసతో ఉండి రాష్ట్ర సాధన కోసం పనిచేసిన ఉద్యమకారులు అందరికీ సముచితమైన గౌరవం ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరుకొంటున్నారు. ఉద్యమకారులు అందరికీ త్వరలో నామినేటడ్ పదవులు ఇవ్వబోతున్నాము. కనుక పదవులు రాలేదని ఎవరూ అధైర్యపడవద్దు,” అని అన్నారు. 

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత, దాని కోసం పోరాడిన తెరాసయే అధికారంలోకి రావడంతో అందరూ చాలా సంతోషించారు. ముఖ్యంగా తెలంగాణా ఉద్యమాలలో పాల్గొన్నవారు తమకి పార్టీలో, ప్రభుత్వంలో సముచిత గౌరవం, గుర్తింపు లభిస్తుందని ఆశించారు. 

కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అవసరమైనప్పుడల్లా ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టేవారు తప్ప తాను స్వయంగా ఏనాడూ అటువంటి భావోద్వేగానికి గురికాకుండా జాగ్రత్తపడ్డారు. ఒక రాజకీయ పార్టీ నాయకుడులాగ ఆలోచించి తన పార్టీని రాజకీయంగా బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకే తనతో కలిసి ఉద్యమాలు చేసిన వారిని పక్కనబెట్టి కాంగ్రెస్, తెదేపా, వైకాపాల ఎమ్మెల్యేలని, అ పార్టీల నేతలని తెరాసలోకి ఆకర్షించి వారికే ముఖ్యమైన పదవులు కట్టబెట్టారు.రాజకీయంగా చూసినట్లయితే అది చాలా మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు. అందుకే రెండున్నరేళ్ళలో తెరాస ఊహించనంతగా శక్తివంతంగా తయారైంది. 

 ఒకవేళ ఆయన కూడా భావోద్వేగాలకి లోనయ్యి ఉండి ఉంటే నేడు తెరాస సర్కార్ లో ఉద్యమకారులే ఎక్కువమంది కనబడి ఉండేవారు. కానీ ఏనాడూ తెలంగాణా ఉద్యమాలలో పాల్గొననివారు, ఉద్యమాలని వ్యతిరేకించినవారు కూడా ఇప్పుడు తెరాస సర్కార్ లో కనిపిస్తుంటారు. 

ఇప్పుడు ఉద్యమకారులకి నామినేటడ్ పదవులు పంచుతామని చెపుతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపి, మంత్రి పదవులవంటివన్నీ ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ఇచ్చి తెలంగాణా కోసం పోరాడిన ఉద్యమకారులకి నామినేటడ్ పదవులు ఇవ్వజూపడం గౌరవమో కాదో తెరాసయే ఆలోచించుకోవాలి.

 ఉద్యమకారుల కంటే ఇంకా ముఖ్యమైన వారు రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకొన్నవారు. ఉద్యమాలు పతాకస్థాయికి చేరుకొన్నప్పుడు, కెసిఆర్, హరీష్ రావు, కవిత వంటి నేతలు తెలంగాణా సాధన కోసం 1200 మందికి పైగా మా బిడ్డలు బలిదానాలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేసేవారు. కానీ తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత వారిలో కేవలం 450 మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించి, వారి కుటుంబాలకి ఆర్ధిక సహాయం చేసింది. మిగిలిన కుటుంబాలకి ఎటువంటి సహాయం అందలేదు. తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్నవారి పేర్లు, వివరాలు తన వద్ద ఉన్నాయని ప్రొఫెసర్ కోదండరాం చెప్పినప్పటికీ ఆయనని, ఆయన మాటలని కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టించుకోలేదు. తెరాస సర్కార్ ఇప్పుడు బాగా కుదురుకొంది కనుక కనీసం ఇప్పటికైనా రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకి, బలిదానాలు చేసుకొన్నావారి కుటుంబాలకి న్యాయం చేస్తే అందరూ హర్షిస్తారు. 


Related Post