పద్ధతి ప్రకారమే కాశ్మీర్ విద్వంసం?

November 03, 2016


img

కాశ్మీర్ లో పరిస్థితులని చక్కదిద్దడానికి కేంద్రప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనబడటం లేదు.  నానాటికీ ఇంకా క్షీణిస్తూనే ఉన్నాయి. సుమారు మూడు, నాలుగు నెలల పాటు అల్లర్లు కొనసాగిన తరువాత పరిస్థితులు కొంత అదుపులోకి వస్తున్నట్లు కనిపించగానే వేర్పాటువాదులు పాఠశాలలు, కాలేజీలని వరుసగా తగులబెడుతున్నారు. ఈ రెండు మూడు నెలల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సుమారు 30-40 పాఠశాలలు, కాలేజీలని వేర్పాటువాదులు తగులబెట్టడం గమనిస్తే, వారు కాశ్మీర్ లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోకుండా చేయాలని చాలా పట్టుదలగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. చివరికి కేంద్రప్రభుత్వం దిగివచ్చి వారిముందు మోకరిల్లినా వారు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

కాశ్మీర్ లో అల్లర్లు చెలరేగి అవి పూర్తిగా అదుపుతప్పినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ పరుగున డిల్లీ వచ్చి కేంద్రప్రభుత్వం సహాయసహకారాలు కోరారు. రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు అటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. వేర్పాటువాదులు ఒక పద్ధతి ప్రకారం వరుసగా పాఠశాలలని తగులబెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయంగా చేతులు ముడుచుకొని చూస్తోంది. ప్రభుత్వ అసమర్ధత, వేర్పాటువాదుల ఈ దుశ్చర్యల కారణంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో విద్యార్ధుల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారాయి. పిల్లలని  వేర్పాటువాదులుగా మలచాలనే ఉద్దేశ్యంతోనే వారిని చదువుకోకుండా అడ్డుపడుతున్నారని ఆమె వేర్పాటువాదులని నిందించారు. అంటే సమస్య ఏమిటనేది ఆమెకి అర్ధం అయ్యింది కానీ దానిని పరిష్కరించలేని అసమర్ధత, నిస్సహాయతతో చూస్తుండిపోతున్నారని స్పష్టం అవుతోంది. 

పాకిస్తాన్ కి సరిహద్దుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉండటం, అయినా వాటిని సరిద్దిద్దలేని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండటం, సరిహద్దుల వద్ద యుద్దవాతావరణం నెలకొని ఉండటం అన్నీ ఆ రాష్ట్రానికి, దేశానికి చాలా అనర్ధదాయకమే. సామదానబేదోపాయలు విఫలం అయ్యాయి కనుక ఇంక వారిపై కేంద్రప్రభుత్వం దండోపాయమే ప్రయోగించవలసి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా దిగజారిపోకముందే గట్టి చర్యలు తీసుకోవడం చాలా అవసరం.

కాశ్మీర్ లో ప్రజలు స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేస్తూంటే భారత ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతోందని పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై గట్టిగా ప్రచారం చేస్తోంది. కనుక కాశ్మీర్ లో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయనే సంగతి కేంద్రప్రభుత్వం మరిచిపోకూడదు. కాశ్మీర్ లో ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగితే అంత భారత్ కే నష్టం, చెడ్డపేరు కలుగుతుంది. ఈ పరిస్థితులని చక్కదిద్దలంటే కేంద్రప్రభుత్వం చాలా కటినమైన నిర్ణయాలు తీసుకొనవలసి ఉంటుంది. ముందుగా పాకిస్తాన్ తో ఆ రాష్ట్ర సరిహద్దులని పూర్తిగా మూసివేసి, ఆ రాష్ట్రాన్ని పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని వేర్పాటువాదులని నిర్దాక్షిణ్యంగా ఏరిపడేస్తే తప్ప అక్కడ పరిస్థితులు చక్కబడే అవకాశాలు కనిపించడం లేదు.


Related Post