ఉత్తంకి గడ్డం గీసుకొనే అవకాశం వద్దనుకొంటే..

November 03, 2016


img

ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పుడప్పుడు కాంగ్రెస్ నేతలని సన్నాసులని అంటుంటారు. వారి పట్ల ఆయనకి అంత చులకన భావం ఉంది. అయన కొడుకు కెటిఆర్ కూడా వారిపట్ల అటువంటి అభిప్రాయమే కలిగి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. నిన్న వరంగల్ ల్లో జరిగినఒక కార్యక్రమంలో మాట్లాడుతూ “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా ఉత్తం కుమార్ రెడ్డి గెడ్డం గీసుకోనని శపథం చేశారు. గడ్డాలు, మీసాలు పెంచుకొన్నంత మాత్రాన్న ఎవరూ అధికారంలోకి రాలేరు. మహా అయితే సన్నాసులవుతారు అంతే!” అన్నారు. 

సన్యాసి, సన్నాసి అనే పదాలు రెండూ ఒకేలాగ ఉన్నప్పటికీ వాటి భావం వేరని అందరికీ తెలుసు. సాధారణంగా అన్నిటిని త్యజించినవారిని సన్యాసులు అంటారు. ఎందుకు పనికి రానివాడిని సన్నాసి అని సంభోదిస్తుంటారు. కెసిఆర్ కాంగ్రెస్ నేతలని సన్నాసులనే అంటుంటారు. మంత్రి కెటిఆర్ కూడా ఉత్తం కుమార్ రెడ్డిని సన్నాసిగా మారుతారనే అంటున్నారు. రాజకీయాలలో తన ప్రత్యర్ధులపై విధానపరంగా విమర్శలు చేయడం తప్పు కాదు కానీ హేళన చేయడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా రాజకీయాలలో ఇంకా పైకి ఎదగాలనుకొంటున్న కెటిఆర్ కి అసలే మంచిది కాదు. అయినా కాంగ్రెస్ నేతలని సన్నాసులని ఎద్దేవా చేస్తూనే మళ్ళీ వారినే తెరాసలో చేర్చుకొంటునప్పుడు తమని తామే ఎద్దేవా చేసుకొన్నట్లు అవుతుందని కెటిఆర్ గ్రహించడం మంచిది.  

కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణా వచ్చిందని చెప్పుకొంటున్నారు. అదే నిజమని ప్రజలు భావించి ఉండి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే నేడు అధికారంలో ఉండేది. కానీ అలా జరుగలేదు. వచ్చే ఎన్నికలలో తప్పకుండా తామే గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది వాదిస్తున్నారు. వారికి నిజంగా అంత నమ్మకమే ఉండి ఉంటే ఈవిధంగా గడ్డాలు, మీసాలు పెంచుకోవలసిన అవసరమే లేదు కదా? కనుక కాంగ్రెస్ నేతలని ప్రగాల్భాలని తెరాస పట్టించుకొనవసరమే లేదు. అయినా తెలంగాణా ఎవరి వలన వచ్చిందనేది ఇప్పుడు అప్రస్తుతం విషయం. దానిని ఏవిధంగా అభివృద్ధి చేసి చూపిస్తారనేదే ముఖ్యం.  తెలంగాణా ప్రజలు తమపై నమ్మకం ఉంచి కొత్త రాష్ట్రాన్ని తమ చేతిలో పెట్టారని కెటిఆర్ చెప్పుకొంటున్నారు కనుక ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనే ప్రయత్నాలు గట్టిగా చేయాలి. అభివృద్ధిని కాగితాల మీద నుంచి ఆచరణలోకి తీసుకువచ్చి చూపించగలిగితేనే తమ మాటలకి విలువ ఉంటుందని గ్రహించాలి. అలాకాక ఎప్పటికేది అవసరమో అది మాట్లాడుతూ కాలక్షేపం చేసేస్తే, ఉత్తం కుమార్ రెడ్డికి గడ్డం గీయించుకొనే అవకాశం తప్పకుండా లభించవచ్చు. 


Related Post