మాజీ సైనికుడి శవాన్ని కూడా వదిలిపెట్టరా?

November 02, 2016


img

కుక్కపిల్ల సబ్బు బిళ్ళ కాదేది కవితకి అనర్హం అన్నారు శ్రీశ్రీ. మన రాజకీయనాయకులు శవరాజకీయాలు కూడా అర్హమైనవే అని అంటున్నారు. 

పదవీ విరమణ చేసిన ఆర్మీ జవాన్లు, అధికారులు చిరకాలంగా అంటే 1973 నుంచి ఒన్-ర్యాంక్, ఒన్-పెన్షన్ కోసం పోరాడుతునే ఉన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిలో కదలిక వచ్చింది. దాని అమలుకి కొన్ని చర్యలు చేపట్టింది కానీ దాని అమలులో అనేక చట్టపరమైన, సాంకేతికమైన సమస్యలు ఉన్నందున నేటికీ వారు కోరుకొంటున్నట్లుగా సమగ్రంగా అమలుకావడం లేదు. దాని అమలు కోసం పోరాడుతున్న మాజీ జవాను రామ్ కిషన్ గ్రేవాల్ నిన్న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద విషం త్రాగి ఆత్మహత్య చేసుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. అధికార భాజపాతో సహా అందరూ ఈ సంఘటనపై రాజకీయాలు చేయడంతో అది ఇంకా పెద్ద సమస్యగా మారింది.    

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్రమంత్రి జనరల్ వికె సింగ్, ‘ఆత్మహత్య చేసుకొన్న ఆ సైనికుడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదేమో?’ అని అనడంతో కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలు రెచ్చిపోయాయి. దేశానికి సేవ చేసిన ఒక సైనికుడు ఎంతో నిరాశ చెంది ఆత్మహత్య చేసుకొంటే వికె సింగ్ ఆవిధంగా మాట్లాడటం చాలా పొరపాటే. దానిని పట్టుకొని కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలు రాజకీయాలు చేయడం ఇంకా పొరపాటు. వారందరూ కలిసి ఆ సైనికుడు ఎందుకు చనిపోయాడో ఆలోచించకుండా నిసిగ్గుగా శవరాజకీయాలు మొదలుపెట్టేశారు. దేశాన్ని చిరకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మాజీ సైనికుల ఆ కోరికని తీర్చలేకపోయినా మోడీ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని విమర్శలు గుప్పిస్తోంది.

ఒకప్పుడు దేశ రాజకీయాలని సమూలంగా ప్రక్షాళన చేసేస్తానంటూ బయలుదేరిన అరవింద్ కేజ్రీవాల్ కూడా సగటు రాజకీయ నాయకుడుగా మారిపోయి చాలా కాలమే అయ్యింది. అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఇద్దరూ రామ్ కిషన్ గ్రేవాల్ కుటుంబ సభ్యులని కలిసేందుకు బయలుదేరి చాలా హడావుడి చేశారు. వారిద్దరూ రామ్ కిషన్ గ్రేవాల్ కుటుంబ సభ్యులని కలిస్తే ప్రళయమేమీ రాదని మోడీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ వారిని కలవనీయకుండా పోలీసుల చేత అరెస్ట్ చేయించింది. వారిద్దరూ కోరుకొంటున్నది కూడా సరిగ్గా అదే! కనుక ఇద్దరికీ మీడియా ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. బహుశః దానిని యూపి, పంజాబ్ ఎన్నికలలో ఓట్లు రూపంగా మార్చుకోవచ్చని కలలు కంటున్నారేమో? ఒక మాజీ సైనికుడు చనిపోతే ఏమాత్రం బాధ పడకుండా, వారి సమస్య పరిష్కారం కోసం ఏమి చేయాలో ఆలోచించకుండా అందరూ కలిసి ఈవిధంగా శవరాజకీయాలు చేయడం చాలా శోచనీయం.



Related Post