అఖిలేష్ వద్దు..ములాయమే ముద్దు?

November 02, 2016


img

ఒకప్పుడు యాదవులలో ముసలం పుట్టి యదుకులాన్ని నాశనం చేసిందని చెపుతుంటారు. మళ్ళీ ఇప్పుడు యూపిలో యదువంశం అంటే ములాయం యాదవ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ల మద్య జరుగుతున్న గొడవల కారణంగా  యూపిలో అధికార సమాజ్ వాదీ పార్టీ వచ్చే ఎన్నికలలో తుడిచిపెట్టుకొనిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి, కొడుకులు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటున్న సమయంలో ఊహించని ఒక ఆసక్తికరమైన రాజకీయ పరిణామం జరిగింది. 

ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గత కొన్ని నెలలుగా పార్టీలో తనకి వ్యతిరేకంగా మారుతున్న పరిస్తుట్లని గమనిస్తూ, ముందు చూపుతో రాహుల్ గాంధీని మంచి చేసుకొని ఆ పార్టీతో పోతులూ పెట్టుకోవడానికి ఆసక్తి చూపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ పట్ల ప్రజల సానుభూతితో ఉన్నారని సర్వేలో తేలింది. కనుక తమతో పొత్తులు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్న అఖిలేష్ తో కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపుతుందని అందరూ భావిస్తున్న సమయంలో, ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ములాయం సింగ్ యాదవ్ తో చేతులు కలపడానికి సిద్దం అవుతున్నట్లు సూచించే పరిణామాలు జరిగాయి. 

కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ నిన్న ములాయం సింగ్ యాదవ్ నివాసానికి వెళ్ళి ఆయనతో చాలాసేపు చర్చలు జరిపారు. అంతకు ముందు ఆయన జెడి(యు) పార్టీ నేత కెసి త్యాగితో కూడా సమావేశం అయ్యారు. అంటే యూపిలో ఆ మూడు పార్టీలు ఎన్నికల పోత్తులకి సిద్దం అవుతున్నట్లు భావించవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ములాయం సింగ్ తో చేతులు కలిపితే, అఖిలేష్ కి అది పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. అప్పుడు ఆయనతో ఎవరు చేతులు కలుపుతారో చూడాలి. కానీ ఈసారి ఎన్నికలలో అధికార సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు భాజపా చేతిలో  ఓడిపోవడం ఖాయం అని సర్వేలు తేల్చి చెపుతున్నాయి. కనుక కాంగ్రెస్ పార్టీ తండ్రి, కొడుకుల్లో ఎవరితో పొత్తులు పెట్టుకొన్నా ఏమీ ప్రయోజనం ఉండకపోవచ్చు. 


Related Post