కెసిఆర్ కి చంద్రబాబు బ్రేక్స్!

November 01, 2016


img

ఊహించినట్లుగానే మళ్ళీ ఏపి, తెలంగాణా ప్రభుత్వాల మద్య సచివాలయం విషయంలో కొత్త వివాదం మొదలుకాబోతోంది.  హైదరాబాద్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో ఉన్న భవనాలని తమకి అప్పగించాలని తెలంగాణా ప్రభుత్వం గవర్నర్ నరసింహన్ ద్వారా చేసిన విజ్ఞప్తిపై నిన్న ఏపి మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తరువాత, షెడ్యూల్: 9, 10 క్రింద ఉన్న ఆస్తుల పంపకాలపై రెండు రాష్ట్రాల మద్య నెలకొని ఉన్న సమస్య పరిష్కారానికి తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే సచివాలయ భవనాలని అప్పగిస్తామని మెలిక పెట్టింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకొన్న ఈ నిర్ణయాన్ని ఏపి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా గవర్నర్ కి తెలియజేసింది.

కనుక షెడ్యూల్: 10 క్రింద ఉన్న ఆస్తుల పంపకాలకి ముఖ్యమంత్రి కెసిఆర్ అంగీకరిస్తే తప్ప సచివాలయ భవనాలు అప్పగించదని స్పష్టం అయింది. ఇది ఆంధ్రా-తెలంగాణా ప్రభుత్వాల మద్య మళ్ళీ ఉద్రిక్తతలు పెంచడం తధ్యం. 

సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో 10 అంతస్తులతో కూడిన కొత్త సచివాలయం నిర్మించుకోవాలనుకొంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాన్ని ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయన నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. దానిపై ఇంకా విచారణ మొదలవక మునుపే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంతో కెసిఆర్ ఆలోచనలకి బ్రేక్ పడినట్లయ్యింది. సచివాలయం కూల్చి వేసి నవంబర్ నెలలోనే కొత్త సచివాలయానికి శంఖుస్థాపన చేయాలనే ఉద్దేశ్యంతో దానిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియ కూడా మొదలుపెట్టేశారు. కానీ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెసిఆర్ కి జలక్ ఇచ్చింది. 

సచివాలయంలో ఏపి ప్రభుత్వానికి కేటాయించిన భవనాలని విభజన చట్టం ప్రకారం అది మరో ఏడున్నరేళ్ళ వరకు తన అధీనంలో ఉంచుకొనే వీలుంది. కనుక వాటిని అప్పటివరకు అప్పగించబోమని ఏపి సర్కార్ చెపితే దానిని తెరాస సర్కార్ ఏమీ చేయలేదు. ఈ సంగతి తెరాస సర్కార్ కి తెలియదనుకోలేము. కానీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని దానిని ఏపి సర్కార్ కూడా పాటిస్తుందని అనుకోవడమే పొరపాటు. ఈ కారణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏపి సర్కార్ కూడా జలక్ ఇవ్వడంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. కనుక ఈ సమస్య పరిష్కారానికి కెసిఆర్ ఏపి సర్కార్ తో రాజీ పడతారా లేక మళ్ళీ కత్తులు దూస్తారా? చూడాలి. 


Related Post