మహనీయుల పంపకాలు దేనికి?

October 31, 2016


img

దేశం మొట్టమొదటి హోంమంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ జయంతి నేడు. మాజీ ప్రధాని స్వర్గీయ  ఇందిరాగాంధీ వర్దంతి కూడా నేడే. ఇద్దరినీ పోల్చి చూడటానికి లేదు కానీ వారి సంకల్పబలం మాత్రం ఉక్కువంటిదే. తలుచుకొంటే దేనినైన సాధించగల సత్తాగలవారు. 

మనకి అటువంటి మహనీయులు వందలమంది ఉన్నారు. వారినందరినీ ప్రాంతాలు, కులాలు, మతాలు, రాజకీయ పార్టీలవారిగా పంచేసుకొని వారి ప్రాధాన్యతని మనమే తగ్గించేసుకొన్నాము. కానీ అంతమాత్రన్న ఆ మహనీయుల గొప్పదనం ఏమీ తగ్గిపోదు. తద్వారా మనం మన సంకుచిత స్వభావాలని బయటపెట్టుకొంటున్నాము అంతే. అయినా దేవుళ్ళనే కులాలు, ప్రాంతాలు, బాషలువారిగా పంచేసుకొన్నప్పుడు మహనీయులని పంచుకోకుండా ఉండగలమా? 

ఇంతకీ ఈ పంపకాల ప్రస్తావన ఎందుకు చేయవలసి వస్తోందంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశసేవ చేసిన మహానీయులని బాగానే స్మరించుకొనేది. కానీ వారిలో మళ్ళీ గాంధీ, నెహ్రులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. ఇందిరాగాంధీ తరువాత అది నెహ్రూ కుటుంబం భజనకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. 

అయితే కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడిన, సేవలు చేసిన మహనీయులని విస్మరించినప్పటికీ దేశప్రజలు ఎన్నడూ విస్మరించలేదు. జాతీయ నాయకులతో బాటు తమతమ రాష్ట్రాలకి చెందిన మహనీయులని కూడా స్మరించుకొంటూనే ఉన్నారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఇంతవరకు దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా ఉన్న ఆ మహనీయులని, వారు దేశం కోసం చేసిన సేవలని, త్యాగాలని పెద్దగా పట్టించుకోలేదు. కనీసం వారి చరిత్రలు కూడా గ్రంధస్తం చేయలేదు. ఆ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకి చెందిన అటువంటి అనేకమంది మహానీయుల గురించి ఉత్తరాది ప్రజలకి, పాలకులకి కూడా తెలియకుండా పోయింది. కానీ ఉత్తరాదికి చెందిన చాలా మంది మహనీయులని దక్షిణాదిన మారు మూల గ్రామాలలో కూడా తలుచుకొంటుంటారు. 

కాంగ్రెస్ హయంలో గాంధీ, నెహ్రూ, వారి వారసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. ఆయన కాంగ్రెస్ పార్టీకే చెందిన వారైనప్పటికీ ఆయనని భాజపా స్వంతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఎలాగుందంటే ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడిని మన ఇంట్లో దాచేసుకోవాలన్నట్లు ఉంది. కనుక అది కూడా సంకుచిత భావమేనని చెప్పక తప్పదు. 

మనం మహనీయుల గొప్పదనం గురించి చెప్పుకొని వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలనుకొంటున్నప్పుడు ఈవిధంగా సంకుచిత ఆలోచనలు చేయకూడదు. ఎందుకంటే, అటువంటి సంకుచిత భావనలతోనే ఇన్ని దశాబ్దాలుగా వల్లబ్ భాయ్ పటేల్ పేరుని కాంగ్రెస్ ప్రభుత్వాలు తలుచుకోలేదు. అలాగే ఈరోజు ఇందిరాగాంధీని భాజపా తలుచుకోలేదు. కనుక మనం మహానీయులని, వారి కీర్తి ప్రతిష్టలని ‘అడాప్ట్’ చేసుకొనే ప్రయత్నాలు చేయడం కంటే, వారిలో గొప్పగుణాల నుంచి స్పూర్తి పొందే ప్రయత్నం చేస్తే దేశానికి ఎంతో మేలు చేసినవారం అవుతాము.      



Related Post