మన తెలంగాణా నెంబర్: 1

October 31, 2016


img

రాష్ట్రంలో ప్రతిపక్షాలు తెరాస సర్కార్ తీరుని, ముఖ్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తీరుని తప్పు పడుతున్న సమయంలో వచ్చే ఎన్నికలలో మళ్ళీ తెరాసయే అధికారంలోకి వస్తుందని తాజా సర్వే తేల్చి చెప్పింది. అది భోగస్ సర్వే అని ప్రతిపక్షాలు కొట్టిపారేస్తున్నప్పుడే మరో సర్వేలో ఆయన దేశంలో కెల్లా అత్యధిక ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రిగా తేలింది. ప్రతిపక్షాలు దానినీ అంగీకరించడం లేదు. 

తెరాస సర్కార్ తీరుని తప్పు పడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చాలా హడావుడి చేస్తున్నాయి. సీపీఎం పార్టీ అయితే మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొని ఉందని, తెరాసకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఇదే మంచి అవకాశమని భావిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దాని కోసం ఏకంగా 5 నెలల సుదీర్గ పాదయాత్ర చేస్తున్నారు. 

రాష్ట్రంలో ప్రతిపక్షాలు తెరాస సర్కార్ తీరుని నిరసిస్తున్న ఈ సమయంలోనే దేశంలో వ్యాపారానికి అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా 2016 సం.కి తెలంగాణా నెంబర్ :1 స్థానంలో ఉందని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు డిల్లీలో ప్రకటించారు. ఇది తెరాస సర్కార్ తీరుని తప్పుపడుతూ హడావుడి చేస్తున్న ప్రతిపక్షాలకి, ముఖ్యంగా రాష్ట్రంలో భాజపా నేతలకి చెంపదెబ్బ వంటిదేనని చెప్పవచ్చు. తెరాస సర్కార్ తీరుని తాము వ్యతిరేకిస్తుంటే దానికి కేంద్ర ప్రభుత్వం నెంబర్ :1 ర్యాంక్ ఇవ్వడంతో వారి వాదనలలో పస లేదని స్పష్టం అవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వమేమీ తెరాసకి మిత్రపక్షం కాదు. రాష్ట్ర భాజపా నేతలు తెరాస సర్కార్ ని నేటికీ విమర్శిస్తూనే ఉన్నారు. 

2015లో 13వ స్థానంలో ఉన్న తెలంగాణా, ఈ ఏడాది ఏకంగా నెంబర్: 1 స్థానానికి ఎగబ్రాకడం సాధారణమైన విషయమేమీ కాదు. రాష్ట్రంలో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధి కోసం తెరాస సర్కార్ అమలుచేస్తున్న సంస్కరణలు, విధానాల ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ అది వెళుతున్న మార్గం సరిగ్గానే ఉందని దీనితో స్పష్టం అయ్యింది. 

గత ఏడాది తెలంగాణా రాష్ట్రానికి 13వ ర్యాంక్ ప్రకటించినప్పుడు, మంత్రి కెటిఆర్, “అటువంటి ర్యాంకుల కంటే తమ చేతలతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధించి చూపుతామని, తమ చేతలే తమ ప్రభుత్వం గురించి తెలియజేస్తాయని” అన్నారు. ఆ మాటలని నిజం చేస్తూ కేవలం ఏడాది వ్యవధిలోనే 13వ స్థానం నుంచి నెంబర్: 1 స్థానానికి రాష్ట్రాన్ని చేర్చగలిగారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా అభివృద్ధి అంకెలలో కాకుండా కళ్ళకి కట్టినట్లు కనబడినప్పుడే నిజమైన విజయం సాధించినట్లు అవుతుంది. మిగిలిన రెండున్నరేళ్ళలో ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెరాస సర్కార్ తప్పకుండా ఆ విజయం సాధిస్తారని ఈ ర్యాంకులో సూచిస్తున్నాయి. 

కేవలం రెండున్నరేళ్ళలో రాష్ట్రానికి దేశవిదేశాలలో ఇంత గుర్తింపు తెచ్చినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కి, మంత్రులకి, ప్రభుత్వంలో  అధికారులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తోంది మై తెలంగాణా.కామ్.    



Related Post