ఆ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం అయ్యిందా?

October 31, 2016


img

వేర్పాటువాదులకి అనుకూలంగా మాట్లాడే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీకి జ్ఞానోదయం అయినట్లే ఉంది. ఆమె మొన్న ఉధంపూర్ లో డి.ఎస్.పి.ఆఫీసర్ల పాసింగ్-అవుట్-పరేడ్ లో వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వేర్పాటువాదులు రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు నడువకూడదని కోరుకొంటున్నారు. తద్వారా కాశ్మీర్ యువత నిరక్షరస్యులుగా, నిరుద్యోగులుగా మారితే వారిని అల్లర్లకి ప్రోత్సహిస్తూ పోలీసులు, భద్రతాదళాలపై రాళ్ళు రువ్వేవారిగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. వేర్పాటువాదులతో కలిసి పనిచేయడం వలన తమ జీవితాలే నాశనం అవుతున్నాయనే సంగతి యువత కూడా గ్రహిస్తోంది. కనుక మీరు అటువంటి యువతని సన్మార్గంలోకి మళ్ళించేందుకు ప్రయత్నించాలని కోరుకొంటున్నాను,”అని ముఖ్యమంత్రి ముఫ్తీ అన్నారు. 

చదువుల విషయంలో కాశ్మీరీ వేర్పాటువాదులు ద్వందవిధానాలు పాటిస్తున్నారు. వారి పిల్లలు, మనుమలు చదువుతున్న స్కూళ్ళు, కాలేజీల జోలికి వాళ్ళు వెళ్ళరు...ఎవరినీ వెళ్ళనీయరు. స్థానికంగా వారి విద్యాభ్యాసం పూర్తి చేసుకొన్న తరువాత ఉన్నత విద్యల కోసం విదేశాలకి పంపిస్తున్నారు. కానీ సామాన్యుల పిల్లలు చదువుకొనే సర్కారీ స్కూళ్ళు, కాలేజీలని నడవనీయకుండా అడ్డుపడుతుంటారు. కనుక ఈ విషయంలో మహబూబా ముఫ్తీ చెప్పిన మాట నిజమేనని నమ్మవచ్చు. 

వేర్పాటువాదులకి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక రాజకీయ నేత మాట్లాడటం బహుశః ఇదే మొదటిసారికావచ్చు. వేర్పాటువాదుల ద్వంద వైఖరిని ఆమె గుర్తించారు కనుక ఇక నుంచైనా ఆమె వారి పట్ల కటినంగా వ్యవహరించగలిగితే, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వేర్పాటువాదుల ప్రాబల్యం క్రమంగా తగ్గించవచ్చు. 


Related Post