తెరాస సర్కార్ రెండున్నరేళ్ళ పాలన ఎలా ఉంది?

October 29, 2016


img

తెరాస సర్కార్ రెండున్నరేళ్ళు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా డిశంబర్ 2న హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక బారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు కవిత ఈరోజు మీడియాకి తెలియజేశారు. తెరాస రెండున్నరేళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నమాట వాస్తవమే. ఈ రెండేళ్ళ పాలనని ఒకసారి సమీక్షించినట్లయితే తప్పులు, ఒప్పులు సమానంగా కనిపిస్తాయి. 

తెలంగాణా రాష్ట్ర సాధనకోసం పోరాడిన తెరాసపై కృతజ్ఞతతో, కెసిఆర్ పై నమ్మకంతోనే ప్రజలు వారికి అధికారం కట్టబెట్టారు. తెలంగాణా సాధించిన కెసిఆర్ అయితేనే రాష్ట్రంలో సమస్యలన్నీ తీరుస్తారని, అబివృద్ధి చేస్తారని ప్రజలు గట్టిగా నమ్మబట్టే తెరాసకి పట్టం కట్టారు.  పంటరుణాల మాఫీ, పేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితులకి మూడెకరాల పొలం, కేజీ టు పిజి ఉచిత విద్య వంటి ఆకర్షణీయమైన హామీలు తెరాస విజయానికి తోడ్పడ్డాయని చెప్పవచ్చు. కానీ కేవలం వాటిని చూసే గెలిపించారని భావించలేము. 

తెరాస సర్కార్ చేసిన మంచి పనులలో విద్యుత్ సంక్షోభాన్ని అరికట్టడం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పధకాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రప్పించడంలో కొంతవరకు విజయం సాధించారనే చెప్పవచ్చు. కానీ అన్నివిధాల అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం ఉన్నప్పటికీ ఆశించినంతగా పరిశ్రమలని ఆకర్షించలేకపోయారని చెప్పక తప్పదు. 

రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనే కెసిఆర్ ఆలోచనలని, చిత్తశుద్ధిని శంఖించనవసరం లేదు. అయితే వాటిని ఆంధ్రా కాంట్రాక్టర్ల చేతిలో పెట్టడం, వాటిలో అవినీతి జరగడం రెండు ప్రధానలోపాలుగా కనిపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కొంత పురోగతి కనిపిస్తున్నప్పటికీ, దుందుడుకు నిర్ణయాల వలన వివాదాలు చెలరేగి న్యాయపోరాటాలు చేయవలసి వస్తునందున ఆలస్యం అవుతోంది. 

జిల్లాల పునర్విభజన చేసి తను అనుకొన్నది సాధించగలనని కెసిఆర్ నిరూపించి చూపారు. అలాగే ఈ రెండున్నరేళ్ళలో జరిగిన ప్రతీ ఎన్నికలని ఒక ప్రత్యేక యుద్ధంగా భావిస్తూ అందుకు బలమైన వ్యూహాలు రచించి వరుసగా విజయాలు సాధించగలిగారు. ముఖ్యంగా తెరాసకి ఏమాత్రం పట్టులేని గ్రేటర్ లో విజయం సాధించడం అసలైన విజయంగా చెప్పవచ్చు. 

కానీ అందుకోసం పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడాన్ని ఎవరూ హర్షించలేరు. ఒకవేళ ప్రజలందరూ మెచ్చుకొనేలాగ తన ప్రభుత్వం పరిపాలన చేస్తోందని కెసిఆర్ భావిస్తున్నట్లయితే అటువంటి అనైతిక, అప్రజాస్వామ్య పనులు చేయనవసరమే లేదు. 

హామీల అమలుని కూడా కెసిఆర్ అంత సీరియస్ గా తీసుకొన్నట్లు లేదు. అందుకే నేటికీ వాటిలో చాలా అమలుకాలేదు. బంగారి తెలంగాణా నిర్మించడం అంటే పాత భవనాలని కూలగొట్టి కొత్తవి కట్టుకోవడమే అన్నట్లుగా కెసిఆర్ వ్యవహరిస్తుండటాన్ని ప్రతిపక్షాలు ఎంతగా ఆక్షేపిస్తున్నా అసలు పట్టించుకోవడం లేదు. 

నేటికీ రాష్ట్రంలో రైతులు ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో రావినూతలలో సుమారు రెండు వేలమంది పైగా డెంగూ వ్యాధితో ఆసుపత్రుల పాలయ్యారు. సుమారు 20-30 మంది మృతి చెందారు కూడా. సిరిసిల్లాలో నేతన్నల సమస్యలు, నల్గొండలో ఫ్లోరోసిస్ భాదితులు, కరీంనగర్ లో బీడీ కార్మికుల సమస్యలు...ఇలాగ ఒక్కో జిల్లాని పట్టి చూసినట్లయితే రకరకాల సమస్యలు కనిపిస్తాయి. వాటి పరిష్కరం కోసం కెసిఆర్ ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ఎవరూ వేలెత్తి చూపేవారు కాదు పైగా జేజేలు పలికేవారు. కానీ ఆయన హైదరాబాద్ లో పాత భవనాలని కూల్చి వేసి కొత్తవి కట్టుకోవడానికి ప్రజాధనం వృధా చేస్తున్నారు. ఆయన నిర్ణయాలని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు న్యాయపోరాతాం కూడా ప్రారంభించాయి. అయినా కెసిఆర్ ఏ మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనబడటం లేదు. 

కెసిఆర్ తనకి దక్కిన ఈ అపూర్వ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్రంలో మారుమూల గ్రామాలని, పట్టణాలని కూడా హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధి చేసి, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు గట్టిగా కృషి చేయడం ప్రాధాన్యతగా భావిస్తే ప్రజలే ఆయనకీ మళ్ళీ మళ్ళీ పట్టం కడతారు కదా!   



Related Post