కెసిఆర్ చిత్తశుద్ధితో చేస్తే సాధ్యమే

October 28, 2016


img

తెరాస ఎన్నికల వాగ్ధానాలలో ముస్లింలకి 12 శాతం రిజర్వేషన్లు కల్పించడం కూడా ఒకటి. ఇప్పటికి రెండున్నరేళ్ళు పూర్తయింది కానీ ఇంతవరకు దాని కోసం గట్టిగా కృషి జరుగలేదు. దాని కోసం ఏర్పాటు చేసిన సుధీర్‌ కమిటీ నివేదిక కూడా ప్రభుత్వానికి అందిందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ముస్లింలకి, బీసీలకి కూడా రిజర్వేషన్ల శాతం పెంచడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. తమిళనాడు పద్దతిలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి దానిని కూడా ఒప్పించి రిజర్వేషన్లు వచ్చేలా చేస్తామని కెసిఆర్ చెప్పారు.

ఈ ఐదేళ్ళలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులపై ప్రభుత్వం బారీగా ఖర్చు  పెట్టవలసివచ్చిందని, అవి పూర్తయితే ఇకపై రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసమే బడ్జెట్ లో బారీగా నిధులు కేటాయించుకోగలుగుతమని కెసిఆర్ చెప్పారు. బీసిల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది కనుకనే బీసి కమీషన్ ఏర్పాటు చేసిందని అన్నారు. కనుక రాష్ట్రంలో సుమారు 80శాతం ఉన్న బీసిల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయంపై కమీషన్ లోతుగా అధ్యయనం చేసి వారి అవసరాలని తీర్చేవిధంగా సిఫార్సులు చేయాలని అన్నారు. బిసి కమీషన్ చేసే సిఫార్సుల వలన అటు బీసిలకి మేలు చేకూరాలి, ప్రభుత్వానికి, బీసి కమీషన్ కి కూడా మంచి పేరు వచ్చేలాగ ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. 

రాష్ట్రంలో బీసి, ముస్లింల జనాబా అధికంగా ఉందనే విషయం అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు. కానీ ఇంతవరకు వారిని కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూశారు తప్ప ఏనాడూ వారి సమస్యలని పరిష్కరించి, వారి జీవన ప్రమాణాలు పెంచి వారి జీవితాలలో వెలుగులు నింపుదామని అనుకోలేదు. గత ఎన్నికలలో బీసిల ఓట్లని సంపాదించుకోవడానికే చంద్రబాబు బీసి సంఘాల నేత ఆర్. కృష్ణయ్యని పార్టీలోకి రప్పించి టికెట్ ఇచ్చి, తెదేపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం అందరూ చూశారు. కానీ ఆ తరువాత ఆయన పట్ల తెదేపా ఏవిధంగా వ్యవహరించిందో చూశారు. 

కెసిఆర్ కూడా బీసిల కోసం చాలా చేస్తామని చెపుతున్నారు కానీ ఆయన మాటలలో కనబడుతున్న చితశుద్ధి ఆచరణలో కనబడటం లేదు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళ తరువాత ఇంకా వారి రిజర్వేషన్ల కోసం శాసనసభలో తీర్మానం చేస్తామని, కేంద్రాన్ని ఒప్పిస్తామని చెపుతున్నారు. కనుక ఆ ప్రక్రియ ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పటికైనా కెసిఆర్ గట్టిగా పట్టుబట్టి దాని కోసం ప్రయత్నిస్తే అది సాధ్యమేనని చెప్పవచ్చు. 

వచ్చే ఎన్నికలలో మజ్లీస్ పార్టీ మద్దతు లేకుండా ముస్లింల ఓట్లు సంపాదించుకోవాలనుకొంటే వారి రిజర్వేషన్ల శాతం పెంచేందుకు కెసిఆర్ గట్టిగా కృషి చేయకతప్పదు. బిసిల సంక్షేమం, రిజర్వేషన్ల విషయంలో కూడా తెరాస సర్కార్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే వచ్చే ఎన్నికలలో దానికే వారి ఓట్లు పడతాయి. కానీ కేవలం మాటలతోనే మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే ఆయనకే నష్టం.


Related Post