అమరావతికి మళ్ళీ శంఖుస్థాపన..దేనికో?

October 28, 2016


img

ఏపి రాజధాని అమరావతికి సుమారు ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చాలా అట్టహాసంగా శంఖుస్థాపన జరిగింది. దానికి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. కనుక వెంటనే రాజధాని నిర్మాణపనులు మొదలుపెట్టుకోవచ్చు కానీ స్విస్ ఛాలెంజ్ పద్దతిలో విదేశీ సంస్థల చేతే అమరావతి నిర్మాణం చేయించాలనే చంద్రబాబు పట్టుదలతో ఉండటం, దానికి అనేక అవాంతరాలు ఎదురవుతుండటంతో ఇంతవరకు నిర్మాణపనులు మొదలుపెట్టలేదు. అందుకు ఏపిలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే ప్రజలని, ప్రతిపక్షాలని మభ్యపెట్టేందుకు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చేత మళ్ళీ ఈరోజు శంఖుస్థాపన చేయిస్తున్నారని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేత ఒకసారి శంఖుస్థాపన చేయించిన తరువాత మళ్ళీ మళ్ళీ ఎందుకు శంఖుస్థాపనలు చేయిస్తున్నారని వైకాపా ప్రశ్నకి తెదేపా పట్టించుకోవడం లేదు. 

రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యలని ఎదుర్కొంటోందని, రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలని నిత్యం పాటపాడే చంద్రబాబు,ఇటువంటి వృధా ఖర్చులని మాత్రం మానుకోరు. ఎందుకంటే, ప్రతీ పనిని చాలా అట్టహాసంగా నిర్వహించి ప్రచారం పొందాలని కోరుకొంటారు కనుక. ఆయన ప్రమాణస్వీకారం నుంచి నేటి వరకు అదే ధోరణి కొనసాగుతోంది. ఆయన ప్రచార యావ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయిపోతోందని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్న వాటిని చంద్రబాబు పట్టించుకోరు. 

ఈరోజు జైట్లీ చేతుల మీదుగా జరుపబోయే రెండవ శంఖుస్థాపన కార్యక్రమాన్ని కూడా చాలా అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. రాజధానిలో చాలా భవనాలు నిర్మించవలసి ఉంది కనుక బహుశః ఇంకా చాలాసార్లు ఈ శంఖుస్థాపన కార్యక్రమాలు ఉండవచ్చు. 

గమ్మతైన విషయం ఏమిటంటే, రాజధానిలో భవనాల నిర్మాణానికి ప్రభుత్వం వద్ద ఇంతవరకు డ్రాయింగులే లేవు. నిన్ననే వాటి కోసం గ్లోబల్ టెండర్లు పిలిచారు. ఇక స్విస్ ఛాలెంజ్ సీరియల్ కోర్టులో కొనసాగుతోంది. చేతిలో డ్రాయింగులు లేవు. నిర్మించే సంస్థ లేదు. కానీ నవంబర్ 1 నుంచి రాజధాని నిర్మాణపనులు మొదలుపెట్టేస్తామని ప్రకటించేశారు. వాటిని ఎవరు, ఏవిధంగా నిర్మిస్తారో ...ఈలోగా ఇంకా ఎన్నిసార్లు శంఖుస్థాపనలు చేస్తారో చూడాలి. 



Related Post