రేవంత్ రెడ్డి ఒక్కడి వలన అది సాధ్యమేనా?

October 28, 2016


img

తెలంగాణాలో తెదేపా తరపున గట్టిగా మాట్లాడే ఏకైక వ్యక్తి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మిగిలినవారు కూడా మాట్లాడుతుంటారు కానీ ఏదో మొక్కుబడిగా అన్నట్లు ‘మమ’ అనిపించేస్తుంటారు. కనుక తెలంగాణాలో తెదేపా అంటే రేవంత్ రెడ్డే అనే అభిప్రాయం కలుగుతుంటుంది. అది సహజం కూడా. నిన్న మహబూబ్ నగర్ జెడ్.పి.సెంటరులో జరిగిన తెదేపా అగ్రనేతల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

తనని ఆదరించిన పాలమూరు జిల్లాని 10 ముక్కలుగా చేసి రుణం తీర్చుకొన్నారని ఎద్దేవా చేశారు. జిల్లాల పునర్విభజనతో ఎవరి ఏ జిల్లాలో ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లాలు విడగొట్టినా, తనని పాలమూరు ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తానని హామీ ఇచ్చిన కెసిఆర్ ఆ హామీని అమలుచేయలేదు కానీ తన కోసం 10 ఎకరాలలో రూ.150 కోట్లు ఖర్చు చేసి ఇంద్రభవనం వంటి పెద్ద ఇల్లు కట్టుకొంటున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ, బార్లని తెరుస్తున్నారని ఎద్దేవా చేశారు. నకిలీ ఉద్యమకారులు అందరూ కలిసి ప్రభుత్వంలో చేరడం వలననే రైతుల కష్టాలు వారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

తెదేపాని డ్డీ కొనలేక ఫిరాయింపులకి ప్రోత్సహించి పార్టీని బలహీనపరిచి, ఆంధ్రా పార్టీ అనే ముద్రవేసి తెదేపాని ప్రజలకి దూరం చేయాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని, కానీ తెదేపా పుట్టింది ఈ తెలంగాణా గెడ్డ మీదనేనని, అది తెలంగాణా ప్రజల కోసమే పోరాడుతున్న పార్టీ అని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికలలో తెరాసని ఓడించి కెసిఆర్ ని గద్దె దింపుతామని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రాజకీయాలని ఇదే పాలమూరు జిల్లాని కేంద్రంగా చేసుకొని శాశిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.  

రేవంత్ రెడ్డిలో కనిపిస్తున్న ఆ పట్టుదల, నమ్మకం, ఆత్మవిశ్వాసం పార్టీలో మిగిలిన నేతలలో కూడా కనిపిస్తే, ఆయన ప్రతిజ్ఞలకి అర్ధం ఉంటుంది. కానీ రాష్ట్రంలో చాలా బలంగా నిలద్రొక్కుకొన్న తెరాసని పార్టీలో ఆయన ఒక్కరే ఏవిధంగా డ్డీ కొని ఓడించగలరు? తెదేపా నేతలు అందరూ ఆలోచించుకోవలసి ఉంది. ఒకవేళ వారందారూ తెదేపాలోనే కొనసాగాలని గట్టిగా భావిస్తున్నట్లయితే, వారు కూడా రేవంత్ రెడ్డితో చేతులు కలిపి పోరాడవలసి ఉంటుంది. రాష్ట్రంలో మళ్ళీ తమ పార్టీని పునాదుల నుంచి నిర్మించుకోవలసి ఉంటుంది లేకుంటే వారి రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారడం ఖాయం.        



Related Post