పవన్ ఓకే..కానీ జగన్ కాదుట!

October 27, 2016


img

ఏపిలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అయనకి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ వస్తున్నారు. జగన్ అడపా దడపా యువభేరీలు మ్రోగిస్తుంటే, పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు బహిరంగ సభలు పెడుతూ హడావుడి చేస్తున్నారు. కనుక పవన్, జగన్ ఇద్దరూ ప్రస్తుతం ప్రత్యేక పోరాట యోధులుగా బరిలో మిగిలారు. 

వారిలో జగన్ కేవలం చంద్రబాబు నాయుడిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పోరాటాలు చేస్తుంటే, పవన్ కళ్యాణ్ భాజపాని, వెంకయ్య నాయుడుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ ఇద్దరూ కూడా ప్రత్యేక హోదా ఈయవలసిన ప్రధాని నరేంద్ర మోడీని పల్లెత్తు మాటనరు. డిల్లీ, కేంద్రం, భాజపా అంటారే తప్ప నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపి ప్రజలని మోసం చేశారని అనరు. ఎవరి లెక్కలు, సమస్యలు, జాగ్రత్తలు వారివి. అందుకే వారి లక్ష్యాలు కూడా భిన్నంగా ఉంటాయి. 

జగన్ నోరు విప్పితే చంద్రబాబు నాయుడు పేరుని తలుచుకోకుండా మూసుకోలేరు. ప్రతిపక్ష నేత నిత్యం తమ నాయకుడి నామస్మరణ చేస్తుంటే, తెదేపా నేతలు సంతోషించకపోగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తుంటారు. అదే పవన్ కళ్యాణ్ కూడా తమ పార్టీకి చురకలు వేస్తుంటే వాటిని ఎంచక్కగా ఆస్వాదిస్తుంటారు. వాటిని స్వాగతిస్తుంటారు కూడా. పవన్ తమ శ్రేయోభిలాషి కనుక ఆయన సదుదేశ్యంతోనే తమకి సలహాలు ఇస్తున్నారని సర్ది చెప్పుకొంటారు కూడా. 

పవన్ కళ్యాణ్ కూడా తెదేపాతో అదేవిధంగా సర్దుకుపోతుంటారు. ఇదివరకు రాజధాని భూముల విషయంలో సర్దుకు పోయారు.  మళ్ళీ ఇప్పుడు భీమవరంలో స్థాపిస్తున్న ఆక్వా ఫుడ్ పార్క్ తో సర్దుకుపోతున్నారు. దాని వలన ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుందని అక్కడి ప్రజలు హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ కి మొరపెట్టుకొంటే, దానిని అక్కడి నుంచి వేరే చోటికి మార్చేస్తే  బాగుంటుంది కదా? అని మెత్తగా అడిగారు. దానిని తీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరాఖండీగా చెప్పినప్పటికీ, పవన్ కళ్యాణ్ మళ్ళీ స్పందించలేదు. 

దాని గురించి అనంతపురం సభలో ప్రభుత్వానికి చురకలు వేస్తారేమో? అంతటితో ఆ సమస్యని పరిష్కరించేసినట్లే పవన్ కళ్యాణ్ భావిస్తారేమో? బహుశః అందుకేనేమో తెదేపా కూడా అయన విమర్శలని లైట్ తీసుకొంటోందేమో?


Related Post