డా.లక్ష్మణ్ కనుగొన్న కొత్త సిద్దాంతం?

October 27, 2016


img

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఒక కొత్త సిద్దాంతం కనుగొన్నారు. అదేమిటంటే ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రాలు, దేశం అభివృద్ధి సాధ్యం కాదుట! కేవలం జాతీయ పార్టీకి మాత్రమే అది సాధ్యం అవుతుందిట! అంటే ఆయన తెలంగాణాలో తెరాస వల్ల రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని, జాతీయ పార్టీ అయిన తమ పార్టీ వలనే అది సాధ్యం అవుతుందని చెప్పడమే ఆయన ఉద్దేశ్యం. కానీ దేశంలో తెలంగాణా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. వెంకయ్య నాయుడుతో సహా కేంద్రమంత్రులు అందరూ అదే చెపుతున్నారు. తెదేపా అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని వెంకయ్య నాయుడుతో సహా కేంద్రమంత్రులు అందరూ చెపుతున్నారు. తమిళనాడులో చిరకాలంగా ప్రాంతీయ పార్టీలే పరిపాలిస్తున్నాయి. ఆ రాష్ట్రం కూడా దేశంలో చాలా రాష్ట్రాలకంటే మంచి అభివృద్ధి సాధించింది. కనుక ప్రాంతీయ పార్టీల వలన అభివృద్ధి సాధ్యం కాదనే వాదనలో అర్ధం లేదు. 

కానీ, డా.లక్ష్మణ్ తన వాదనని సమర్ధించుకోవడానికి సంక్షోభంలో చిక్కుకొన్న యూపి ప్రభుత్వాన్ని చూపిస్తున్నారు. అక్కడ సమాజ్ వాదీ పార్టీ కుటుంబపాలన సాగుతున్నందున, వారి మధ్య గొడవల కారణంగా రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడిందని డా. లక్ష్మణ్ వాదిస్తున్నారు. అధికారం కోసం వారి మధ్య జరుగుతున్న కీచులాటల వలన పాలన స్తంభించిపోవడమే కాకుండా, అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయాయని డా.లక్ష్మణ్ వాదిస్తున్నారు. కనుక తెలంగాణాలో కూడా ఏదోఒక రోజు అటువంటి పరిస్థితులే రావచ్చని డా.లక్ష్మణ్ జోస్యం చెపుతున్నారు. 

ప్రజాస్వామ్య వ్యవస్థలో కుటుంబపాలన సమర్ధనీయం కానప్పటికీ, ప్రస్తుత పరిస్థితులలో అధికారంలో ఉన్న జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలు దానిని తప్పుగా భావించకపోవడంతో అదే విధానం అమలు అవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. నెహ్రూ కాలం నుంచి నేటి వరకు అది వారి గుప్పిట్లోనే ఉంది. ఇక ముందు కూడా ఉండే అవకాశాలే కనబడుతున్నాయి. కానీ భాజపాలో కుటుంబ పాలన సాగడం లేదు కనుకనే డా.లక్ష్మణ్ ఈ సిద్దాంతం ప్రతిపాదించినట్లు చెప్పవచ్చు. కుటుంబ పాలన ఎప్పుడూ అనర్ధదాయకమే కానీ ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి జరుగదనే ఆయన వాదన మాత్రం అర్ధరహితమేనని చెప్పక తప్పదు.    



Related Post